NCP Chief Sharad Pawar: బీజేపీతో పొత్తు, అలయన్స్‌పై ఎన్సీపీ అధినేత శరత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఏ దశలోనూ బీజేపీతో కలిసి వెళ్లదని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని సంగోలాలో రైతులు, కార్మికుల పార్టీ నాయకుడు, దివంగత గణపత్రావ్ దేశ్‌ముఖ్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు తమకు సరిపోవన్నారు. కూటమిలో విభేదాలు లేవని, ఎన్డీఏను గద్దె దించడమే లక్ష్యమన్నారు.


ఆయన మాట్లాడుతూ.. “మాలో కొందరు (అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ గ్రూప్) భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. మా శ్రేయోభిలాషులు కొందరు కొత్త పంథాను ఎంచుకున్నారు. కూటమి గురించి చర్చిస్తున్నారు. నేను బీజేపీతో వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే వారు మాతో చర్చకు ప్రయత్నిస్తున్నారు. కానీ నాకు అలాంటి ఉద్దేశమే లేదు" అని పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరిన మేనల్లుడు అజిత్ పవార్‌తో తన 'రహస్య' సమావేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ అజిత్‌తో తన భేటీలో రహస్యమేమీ లేదన్నారు. 


‘అజిత్ పవార్ నా మేనల్లుడు, పవార్ కుటుంబంలో నేను ఇప్పుడు కుటుంబ పెద్ద స్థానంలో ఉన్నాను. నాకు, నా కుటుంబంలోని ఒకరికి మధ్య సమావేశం సమస్య కాకూడదు. కింది స్థాయిలో కూడా ఎలాంటి గందరగోళం లేదు’ అని శరద్ పవార్ అన్నారు. " రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ పరిస్థితి ఏర్పడినప్పుడల్లా, ఎన్సీపీ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. 


ఛత్రపతి సంభాజీనగర్‌లో ఫడ్నవీస్ మాట్లాడుతూ పవార్‌ల మధ్య జరిగిన రహస్య సమావేశం గురించి తనకు తెలియదని అన్నారు. తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి సమావేశం ఏదైనా జరిగిందో లేదో తెలియదన్నారు. సమావేశం జరిగే స్థలం, ఎంతసేపు జరిగింది, ఏం చర్చించారనే విషయంపై సమచారం లేదన్నారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నలను పడ్నవిస్ పక్కన పెట్టారు. 


జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో చేరడానికి సీనియర్ పవార్‌ను ఒప్పించేందుకు అజిత్ పవార్ వర్గం చేసిన ప్రయత్నాల మధ్య ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు పవార్‌ల మధ్య జరిగిన సమావేశానికి కొద్దిసేపు హాజరైన మహారాష్ట్ర ఎన్‌సీపీ చీఫ్ జయంత్ పాటిల్ తన సోదరుడికి పంపిన ఈడీ నోటీసుకు సమావేశానికి లింకు పెట్టొద్దన్నారు.  


సంగోలలో పవార్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులను మార్చడానికి ఓటు వేయడం తక్షణ ప్రాధాన్యత అని అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి I.N.D.I.Aలోని అన్ని పార్టీలు ఏకమయ్యాయని ఆయన తెలిపారు.  ఫ్రంట్‌లో ఏమైనా విభేదాలు ఉన్నాయా అని అని అడిగినప్పుడు, పవార్ ‘కచ్చితంగా లేవు’ అని అన్నారు. సెప్టెంబరు 1న ముంబైలో జరగనున్న I.N.D.I.A నేతల సమావేశం నిర్దిష్ట అంశాలపై చర్చించడం, వ్యూహాన్ని రూపొందించడంపై దృష్టి సారిస్తుందని పవార్ చెప్పారు. సమావేశానికి సంబంధించిన ప్రాథమిక ఎజెండాను ఆగస్టు 31న రూపొందించనున్నట్లు చెప్పారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial