Sharmila will go to Delhi to join Congress :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను ఆ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. గురువారం ఆమె ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్టీ విలీనం, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై ఆమెతో కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నట్లు సమాచారం.  ఆంధ్రప్రదేశ్   బాధ్యతలు ఇవ్వడానికి హస్తం అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీలో ఉన్నారు. 


ఏపీ కాంగ్రెస్ నేతలతో  హైకమాండ్ చర్చలు                                         


మరో వైపు ఏపీ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ తో సహా ఏపీ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లారు.  అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.  అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజపరిచేలా నిర్ణయాలను అధిష్టానం తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. 


తెలంగాణకు బదులుగా ఇక ఏపీలోనే రాజకీయాలు చేసే చాన్స్                                 


షర్మిల తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో  తన పార్టీవి విలీనం చేయాలనుకున్నారు. ఈ అంశంపై డీకే శివకుమార్ సాయంతో హైకమాండ్ తో చర్చలు జరిపారు. ఓ సారి ఢిల్లీకి వెళ్లి సోనియాతో కూడా సమావేశం అయ్యారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆగిపోయారు. తర్వాత ఆమెను తెలంగాణ రాజకీయాల్లో కంటే.. ఏపీ రాజకీయాల్లో పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. షర్మిల వల్ల ఏపీలో పార్టీకి మేలు జరుగుతుందని సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు జరపడంతో ఏపీలో రాజకీయాలు చేసేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 


వైసీపీ వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తిరిగి  వస్తుందా ?                                   


ఏపీలో సీఎం జగన్ సొంత పార్టీ వైసీపీని పెట్టుకోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయింది. కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేకపోవడంతో  క్యాడర్ , లీడర్లు అంతా జగన్ వెంట వెళ్లిపోయారు. అప్పట్నుంచి నాయకత్వ సమస్య ఉంది. ఇప్పుడు షర్మిల రాకపోతే.. ఆ సమస్య తీరుతుందని .. కాంగ్రెస్ పార్టీని గతంలో ఆదరించిన వర్గాలన్నీ మళ్లీ కాంగ్రెస్ వైపు వస్తాయని నమ్ముతున్నారు. షర్మిల కూడా గట్టిగా  తన రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నించాలని.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుకుంటున్నారు.