Amalapuram constituency Politics: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న వైసీపీ రాష్ట్రంలో పలు చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్థానాల మార్పు అనివార్యం చేసింది. ఇప్పటికే ఐ ప్యాక్‌ ద్వారా సర్వే రిపోర్టులు తెప్పించుకున్న అధిష్ఠానం ఆ దిశగా అభ్యర్ధులు మార్పులు గురించి దృష్టిసారించింది. కానీ ఈ మార్పులు ప్రక్రియలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నియోజకవర్గంలో మాత్రం తండ్రీ కొడుకుల మధ్య గ్యాప్‌ పెరిగేలా చేస్తోందన్న చర్చ జరుగుతోంది. 


ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన అమలాపురం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలుపొందిన పినిపె విశ్వరూప్‌ సీనియర్‌ కావడంతో సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన రవాణాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్‌ను మార్చనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేసిన విశ్వరూప్‌ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నారు. 


ఆయన కుమారుడు పినిపే శ్రీకాంత్‌ కూడా టిక్కెట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే విశ్వరూప్‌కు బదులు నియోజకవర్గ ఇంచార్జ్‌గా తనయుడు శ్రీకాంత్‌ను నియమంచనున్నారని ప్రచారం జరిగింది. దీంతో తండ్రీ కొడుకుల మధ్య కొంత మనస్పర్దలు తారాస్థాయికి చేరినట్లు పార్టీ క్యాడర్‌లోనే చర్చ జరుగుతోంది.


పార్టీ క్యాడర్‌ ఏం కోరుకుంటోంది..?
మంత్రి పినిపె విశ్వరూప్‌కు పార్టీ క్యాడర్‌లో బాగానే పట్టు ఉంది.. అమలాపురం అల్లర్ల కేసుల కారణంగా కొన్ని వర్గాలు దూరమైనా సీనియర్‌ నాయకులు, ద్వితీయ శ్రేణి విశ్వరూప్‌తోనే ఉంది. గతేడాది జరిగిన హార్ట్ సర్జరీ కారణంగా చిన్న కుమారుడు శ్రీకాంత్‌ను వెంటబెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడడంతో పూర్తిగా యాక్టివ్‌ అయ్యారు. దీంతో ఆయనే తిరిగి పోటీ చేయాలని పార్టీ క్యాడర్‌ నుంచి వస్తున్న డిమాండ్. 


అయితే విశ్వరూప్‌కు టిక్కెట్టు రాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అదే టైంలో తనయుడు శ్రీకాంత్‌కి టిక్కెట్టు రావచ్చనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని ఓ వర్గం వైసీపీ లీడర్లు సమర్ధిస్తుంటే సీనియర్లు, మరికొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు.  


సీనియర్లు మాట ఇదేనా..?
అమలాపురం అల్లర్ల కేసుల్లో దూరమైన వర్గాలు మినహా మిగతా వర్గాలన్నీ విశ్వరూప్‌ పక్షానే ఉన్నాయి. వాళ్లంతా శ్రీకాంత్‌కు టికెట్‌  ఇస్తారనే వాదనను వినడానికి కూడా ఇష్టపడటం లేదట. ఈసారికి విశ్వరూప్‌కు పార్టీ టిక్కెట్టు కేటాయించాలని బలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే విశ్వరూప్‌ను కలిసి మీ వెంటే ఉంటాం అంటూ మద్దతు తెలుపుతున్నారట.


తనయుని తాపత్రయంతో అసహనం..
తండ్రిని విభేదిస్తోన్న తనయుడు శ్రీకాంత్‌ పార్టీలో కొందరితో టచ్‌లోకి వెళ్లడంతో కుటుంబంలోనే పార్టీలో కూడా ఒకింత అసహనం కలుగుతోందట. విశ్వరూప్‌ను వ్యతిరేకించే వారితో తనయుడు మంతనాలు సాగిస్తున్నాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తండ్రి ప్రత్యర్థులను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారట. విశ్వరూప్‌ కుమారుడికి టిక్కెట్టు ఇస్తే అభ్యంతరం లేదని పార్టీ  పెద్దల వద్దకు రాయబారం పంపిచారట. 


అధిష్టానం ఇంకా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయకుండానే అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు తనకే ఇచ్చినట్టు ప్రచారం చేయించుకుంటున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఇంచార్జ్‌ల మార్పు మంత్రి విశ్వరూప్‌ కుటుంబంలో మనస్పర్ధలు రగల్చిందని మాత్రం పలువురు చెప్పుకుంటున్నారు.