RSS leader Ram Madhav will be active in BJP politics again :  కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. విభజన తర్వాత ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఇంచార్జులుగా కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ కూడా నియమితులయ్యారు. ఎన్నికల ఇంచార్జుల జాబితాలో రామ్ మాధవ్ పేరు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. మళ్లీ రామ్ మాధవ్ బీజేపీలో ఎప్పుడు పని చేయడం ప్రారంభించారని చర్చించుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే.. ఆరెస్సెస్ బీజేపీ రాజకీయాల్ని వదిలేసి ఆరెస్సెస్ లోకి వెళ్లిపోయారు. గత ఐదేళ్ల కాలంలో ఆయన ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడే కశ్మీర్ పై దృష్టి సారించారు. 


2014 తర్వాత బీజేపీలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ 


2014  ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత మోదీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆరెస్సెస్ నుంచి మురళీధర్ రావుతో పాటు రామ్ మాధవ్ బీజేపీలోకి వచ్చారు. ప్రధాన కార్యదర్శులుగా వారిద్దరికీ పార్టీలో చాలా పవర్ ఉండేది. ముఖ్యంగా రామ్ మాధవ్ కు ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ బాధ్యతలను బీజేపీ అగ్రనేతలు ఇచ్చారు. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉండేది కానీ.. రామ్ మాధవ్ ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. దాంతో ఆయన పేరు మారుమోగిపోయింది. జమ్మూకశ్మీర్ లోనూ పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆయనకు బీజేపీ పెద్దలతో దూరం పెరిగిపోయింది.  


2019 ఎన్నికల తర్వాత తిరిగి ఆరెస్సెస్ లోకి !   


బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో ఓ దశలో.. రామ్ మాధవ్ పేరు బీజేపీ అధ్యక్ష పదవికి వినిపించింది. కారణం ఏదైనా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముందుకు పోలేదు. తర్వాత ఆ పదవి కూడా దక్కకపోవడంతో సైలెంట్ గా ఆరెస్సెస్ లోకి వెళ్లిపోయారు. అయితే మురళీధర్ రావు మాత్రం.. పదవులు వచ్చినా రాకపోయినా  బీజేపీలోనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి టిక్కెట్ కోసం చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మరళీధర్ రావుకు పెద్దగా  బాధ్యతలు లేవు కానీ.. రామ్ మాధవ్ గతంలో కశ్మీర్ వ్యవహారాలను చక్కబెట్టి ఉండటంతో.. ఎన్నికల కోసం ఇంచార్జ్ గా నియమించి ప్రాధాన్య త కల్పిస్తున్నారు. 


తెలుగు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ 


రామ్మాధవ్ గోదావరి జిల్లాలకు చెందిన వారు. మొదటి నుంచి ఆరెస్సెస్ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. యన కేంద్ర బీజేపీలో కీలకంగా ఉన్న సమయంలో ఏపీ రాజకీయాల్లోనూ ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. పలు సార్లు వివాదాస్పద కామెంట్లు చేసేవారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఆయన సలహాలు ఇచ్చేవారని చెప్పేవారు. కారణం ఏదైనా తర్వాత ఇనాక్టివ్ అయ్యారు. ఇప్పుడు కశ్మీర్ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తే మరోసారి బీజేపీలో కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.