చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె హీరోయిన్‌గా చేయడమే కారణం కాదు రాజకీయాల్లోనూ ఆమె ఫైర్ బ్రాండ్. వివాదాలూ ఎక్కువే. అయితే హఠాత్తుగా ఆమె రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కాబోయే మంత్రి అంటూ ఆమె అనుచరులు అందరూ అనుకుంటున్న సమయంలో ఈ ప్రచారం జరగడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రచారంపై రోజా నేరుగా స్పందించారు. తానెందుకు రాజీనామా చేస్తానని ఎదురు ప్రశ్నించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తెలంగాణకు వెళుతున్నానని అసత్య ప్రచారాలు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారన్నారని మండిపడ్డారు. తప్పుచేసినవారు వెళ్లాలని .. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని క్లారిటీ ఇచ్చారు.
అసలు రోజా రాజీనామాపై ఎందుకు ప్రచారం జరిగిందంటే ఇటీవల నగరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలని అనుకోవచ్చు. నగరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. అయితే ఐదు మండలాల్లోనూ వైఎస్ఆర్‌సీపీకి చెందిన బలమైన నేతలు రోజాకు వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డారు. రోజాను పట్టించుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ వ్యతిరేక వర్గంలో ఇద్దరు బలమైన నేతలకు రాష్ట్ర స్థాయి పదవులను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఇచ్చింది. నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజీ కుమార్ సతీమణి శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి, శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ పదవిని రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ఇచ్చారు. వీరిద్దరూ నగరి, నిండ్ర మండలంలో పార్టీని నడిపిస్తున్నారు. రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తన వ్యతిరేక వర్గాన్ని పార్టీ హైకమాండ్ ప్రోత్సహిస్తోందని రోజా ఆగ్రహంతో ఉన్నారని ఈ కారణంగానే ప్రచారంలోకి వచ్చింది. తన నియోజకవర్గానికి చెందిన నేతలకు పదవులు ఇచ్చేటప్పుడు తనకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు. అందుకే రాజీనామా వార్తలు షికారు చేశాయి. కానీ రోజా మాత్రం ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని జగన్ ఆశీస్సులతో తాను రాజకీయాల్లో కొనసాగుతానని అంటున్నారు.
వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని రోజా ఆశించారు. కానీ చిత్తూరు జిల్లా కోటాలో రెండు మంత్రి పదవులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలు పొందారు. రోజాకు అవకాశం లేకుండా పోయింది. రెండున్నరేళ్ల తర్వాత అవకాశం ఇస్తామని హైకమాండ్ అప్పట్లో బుజ్జగించి ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చింది. ఇటీవ ఆ పదవిని కూడా వేరే వారికి కేటాయించింది. ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరిగినా తనకు ప్లేస్ ఖాయమని రోజా నమ్ముతున్నారు. అయితే పరిస్థితులు తారుమారు అవుతూండటంతో ఆమెతో పాటు అనుచరుల్ని కూడా ఇబ్బంది పెడుతోంది.