Telangana Sentiment Politics Revanth Strategy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పుడిప్పుడే పరిపాలన, అభివృద్ధి అంశాలపై చర్చ జరుగుతుందనుకుంటున్న తరుణంలో, మళ్ళీ ఆంధ్ర-తెలంగాణ భావోద్వేగాలను రగిల్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ రాజకీయం
తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న సెంటిమెంట్ రాజకీయాల వెనుక ప్రధానంగా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగాలు క్రియాశీలకంగా కనిపిస్తున్నాయి. గతంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలను తెరపైకి తెచ్చి ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే, ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా జరుగుతున్న రాజకీయం, పవన్ కూడా తెలంగాణపై దృష్టి సారించడం, జూన్ 2న నిర్వహించబోయే సమావేశం వంటి పరిణామాలను ఆయుధంగా చేసుకుని తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కొత్త ఉద్యమాన్ని లేవనెత్తాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. తద్వారా కోల్పోయిన రాజకీయ ఉనికిని మళ్ళీ చాటుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం.
కాంగ్రెస్ లోనూ కనిపిస్తున్న రాజకీయం
కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ సెంటిమెంట్ వేడి కనిపిస్తోంది. అనిరుధ్ రెడ్డి, మందుల సామ్యూల్ వంటి నేతలు ఏపీ నేతలను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వీరు కూడా ప్రాంతీయ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ సెంటిమెంట్ మళ్ళీ బలపడితే, ఆ సెంటిమెంట్‌కు పేటెంట్ హక్కు కలిగిన బీఆర్‌ఎస్‌కే అంతిమంగా లాభం చేకూరుతుందని రేవంత్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన భావోద్వేగాల కంటే బాధ్యతాయుతమైన పరిపాలనకే మొగ్గు చూపుతున్నారు.
సెంటిమెంట్ రాజకీయాలకు రేవంత్ దూరం
రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ను ఎన్నుకున్నది కేవలం సెంటిమెంట్ కోసం కాదు, మార్పు , పరిపాలన కోసం. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ ఉచ్చులో పడితే, కాంగ్రెస్ తన అభివృద్ధి అజెండాను పక్కన పెట్టాల్సి వస్తుంది. పైగా, ఏపీతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. కానీ, తన సొంత పార్టీ నేతలు కొందరు కంట్రోల్ కాకుండా ఏపీపై విమర్శలు చేయడం ఆయనకు తలనొప్పిగా మారింది. రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి డ్యూయల్ స్ట్రాటజీ అమలు చేసే అవకాశం ఉంది. ఒకటి, పార్టీ నేతలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఏపీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవడం. రెండు, బీఆర్‌ఎస్ చేస్తున్న సెంటిమెంట్ ప్రచారాన్ని రాజకీయ డైవర్షన్ గా ప్రజల్లోకి తీసుకెళ్లడం. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులను ఇప్పుడు సెంటిమెంట్ పేరుతో కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆయన వాదించనున్నారు.
పవన్ ను పావుగా వాడుతున్న రాజకీయం
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఈ సమీకరణాల్లో కీలకం. పవన్‌ను టార్గెట్ చేయడం ద్వారా సెంటిమెంట్‌ను పెంచాలని బీఆర్‌ఎస్ చూస్తుంటే, రేవంత్ మాత్రం దాన్ని కేవలం ఒక పొరుగు రాష్ట్ర నేత పర్యటనగా మాత్రమే పరిగణించాలనే ధోరణిలో ఉన్నారు. తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు అనేవి ఒక డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటివి. రేవంత్ రెడ్డి ఈ సెంటిమెంట్ వేవ్ ను సమర్థవంతంగా అడ్డుకోగలిగితేనే కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. ఒకవేళ తన పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో విఫలమైతే, అది బీఆర్‌ఎస్‌కు ఆక్సిజన్ అందించినట్లు అవుతుంది.
