Telangana Congress :  ప్రజా యుద్ధనౌక గద్దర్ గొంతు మూగబోయింది కానీ.. ఆయన చివరి  రోజుల్లో ప్రజాస్వామ్య రాజకీయాలు చేయాలనుకున్నారు. సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇతర పార్టీలతో కన్నా కాంగ్రెస్ తో ఎక్కువ సన్నిహితంగా ఉన్నారు. గద్దర్ చనిపోయిన తర్వాత కూడా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కువ బాధ్యత  తీసుకున్నారు. గద్దర కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు గద్దర్ చివరి కోరికను ఆయన కుమారుడి ద్వారా తీర్చాలని రేవంత్ అనకుంటున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు.


రాజకీయాల్లోకి గద్దర్ కుమారుడు సూర్యం                            


గద్దర్ మొదటి నుంచి విప్లవ పంథాలోనే ఉన్నారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై ..ఓటు రాజకీయాలపై నమ్మకం లేదు. కానీ  తర్వాత మనసు మార్చుకున్నారు. ఓటు హక్కు నమోదు చేసుకుని రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తన వయసు సహకరించకపోయినా తన కుమారుడు సూర్యంను రాజకీయాల్లోకి  తెచ్చి నాయకుడ్ని చేయాలని అనకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. రాహుల్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలిశారు. తర్వాత కుటుబంంతో సహా ఢిల్లీకి వెళ్లి కలిశారు. రేవంత్ రెడ్డి కూడా గద్దర్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు గద్దర్ మరణంతో ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్ ను కల్పించాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. 


సికింద్రాబద్ కంటోన్మెంట్ సీటు పరిశీలన ?                  


టిక్కెట్ల కసరత్తులో చాలా కాలంగా ఉన్న రేవంత్  రెడ్డి కొన్ని రిజర్వుడు నియోజకవర్గాల్లో గద్దర్ కుమారుడి అభ్యర్థిత్వం స్వింగ్ ఓట్లను తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని రేవంత్ సీరియస్ గా పరిశీలిస్తున్నారు. అక్కడ సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దళిత వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన గద్దర్ వారసుడు చట్టసభల్లోకి వెళ్లేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రేవంత్ చెబుతున్నారు. గద్దర్ కుమారుడు కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ఉన్న సూర్య ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తే వదులుకోనని చెబుతున్నారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యం కాకపోతే పార్లమెంట్ టిక్కెట్              


పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీకి పోటీ చేయించలేకపోతే.. పెద్దపల్లి పార్లమెంట్   నుంచి పోటీచేయించాలని కూడా రేవంత్  రెడ్డి భావిస్తున్నారు.  గద్దర్ మంచి స్వభావం ఉన్న వ్యక్తి.. ఆయన లేకున్నా.. కుమారుడి రూపంలో చూడాలని.. టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలువాలని కాంగ్రెస్ భావిస్తోందని చెబుతున్నారు.  ఇప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ హైకమాండ్‌కు కూడా రేవంత్ చేరవేసినట్లు.. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అంటున్నారు. గద్దర్ పై  ఒక్క  దళిత వర్గాల్లోనే కాదు.. అభ్యుదయ భావాలు ఉన్న  ప్రతి ఒక్కరిలో  అభిమానం ఉంది. అది ఓట్ల రూపంలోకి మారితే కాంగ్రెస్‌కూ మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నరు.