RGV About Janasena Seats For AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. చాలా రోజులుగా నాన్చుతున్న సీట్ల పంపకాలపై శనివారం (ఫిబ్రవరి 24న) స్పష్టత వచ్చింది. మొత్తం 175 స్థానాలకుగానూ 118 సీట్లకు టీడీపీ, జనసేన అభ్యర్థులను ఖరారు చేశారు.  118 సీట్లలో టీడీపీకి 94 సీట్లు కేటాయించగా, జనసేనకు 24 సీట్లు ఖరారు చేశారు. టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశారు.


పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 24 సీట్లు ఎందుకు కేటాయించారో తనదైన శైలిలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) కామెంట్ చేశారు. పొత్తులో భాగంగా చంద్రబాబు జనసేనకు 23 ఇస్తే అది టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ జనసేనకు 25 సీట్లు ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారనే...  మధ్యే మార్గంగా 24 సీట్లు కేటాయించారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు సైతం టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై ట్రోల్ చేస్తున్నారు. 






ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేసేకంటే తక్కువ స్థానాలు తీసుకుని ఏపీ ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నాం అన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ, వ్యక్తి ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ‘2019 నుంచి ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అందుకే బాధ్యతతో ఆలోచించాం. కొందరు 45 కావాలి..75 కావాలన్నారు.. వారితో అప్పుడే చెప్పా. 2019లో 10 స్థానాలన్నా గెలిచి ఉంటే నేడు ఎక్కువ సీట్లు అడగడానికి ఛాన్స్ ఉండేది. జనసేనకు కేటాయించిన 24 స్థానాలే కనిపిస్తున్నాయి. కానీ 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే మరో 21 స్థానాల్లో జనసేన భాగం అవుతుంది. అంటే పార్లమెంట్ స్థానాల పరిధిని కలుపుకుంటే 40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లే లెక్క అని’ పవన్ కళ్యాణ్ అన్నారు.






మైండ్ బ్లోయింగ్ లాజిక్..
జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. అయితే మరో 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీలో ఉందని మొత్తంగా 40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు పవన్ చేసిన వ్యాఖ్యలపై సైతం వర్మ సెటైర్లు వేశారు. పవన్ మాట్లాడే వీడియోను వర్మ షేర్ చేస్తూ.. ఇదెక్కడి మైండ్ బ్లోయింగ్ లాజిక్ అని కామెంట్ చేశారు. 2 లక్షల పుస్తకాల్లో ఈ లాజిక్ ఎక్కడ దొరికిందని ఎద్దేవా చేశారు ఆర్జీవీ. 


టీడీపీ- జనసేన పొత్తు బలంగా ఉండాలని బీజేపీని దృష్టిలో పెట్టుకున్నట్లు పవన్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే త్యాగాలు చేసిన వారికి ప్రతిభను బట్టి ప్రతిఫలం భవిష్యత్తులో ఉంటుందన్నారు. జనసైనికులు, వీరమహిళలు మన ఓటు టీడీపీకి ఓటు వెళ్లడం ఎంత ముఖ్యమో... టీడీపీ ఓటు జనసేనకు వెళ్లడమూ అంతే ముఖ్యం అని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.