సినీ నటుడు అలీ ( Actor Ali )  ఇప్పుడు ఉత్కంఠలో ఉన్నారు . సీఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Reddy ) ఏ పదవి ఇవ్వబోతున్నారనేది ఆయన టెన్షన్. చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులు సీఎం జగన్‌తో భేటీ అయిన సమయంలో ఆయనను నేరుగా ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో విడిగా ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపాఫీస్‌కు వచ్చారు. ఆ మీటింగ్ తర్వాత సీఎం జగన్ మరో వారంలో కలుద్దామని చెప్పడంతో ఆయనకు రాజ్యసభ సీటు ( Rajya Sabha Seat ) ఇవ్వడం ఖాయమన్న ప్రచారం ప్రారంభమయింది. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో రాజ్యసభ స్థానాల కసరత్తు జరుగుతోంది. మైనార్టీ కోటా కింద ఒకరికి చాన్సివ్వాలని సీఎం జగన్ అనుకుంటున్నారని అది అలీకేనని ఫిక్సయ్యారని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారు. 


సీఎం జగన్ చెప్పినట్లుగానే వారంలోపలే అలీకి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. సతీసమేతంగా వెళ్లీ సీఎం జగన్‌ను కలిశారు. ఆయనకు గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పారు కానీ అది రాజ్యసభ అని మాత్రం చెప్పలేదు. సీఎంతో భేటీ తర్వాత అలీ అదే మాట చెప్పారు. రెండు వారాల్లో పార్టీ ఆఫీసు నుంచి సమాచారం వస్తుందన్నారు. ఇప్పుడు అలీ ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్ చేరుకోక ముందే అలీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ (Wakf Board Chairman ) అనే ప్రచారం వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) వర్గాల్లోనే ప్రారంభమయింది. దీంతో అలీకి దక్కబోయేది రాజ్యసభ సీటా లేకపోతే నామినేటెడ్ పోస్టా అనేదానిపై చర్చ ప్రారంభమయింది. 


రాజ్యసభ సీటు అంటే చాలా పెద్ద పదవే అనుకోవాలి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో రాజ్యసభ సీటు చిన్న నేతలకు ఇటీవలి కాలంలో దక్కలేదు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులంతా ఏదో రంగంలో పెద్దలే.  ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాల కోసం వైఎస్ఆర్‌సీపీ అధినేతపై చాలా ఒత్తిడి ఉందన్న ప్రచారం ఉంది.  మైనార్టీలకు ఇవ్వాలనుకున్నా పార్టీ కోసం అలీ కన్నా ఎక్కువగా కష్టపడిన వారు చాలా మంది ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. గతంలో రిలయన్స్ నత్వానీకి ఇచ్చినట్లుగా ఈ సారి అదానీ కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


ముందస్తు కమిట్మెంట్‌ల ప్రకారం చాలా మంది లైన్‌లో ఉన్నారు. అలీకి ఇవ్వబోయేది వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అని ఇప్పటికే వైసీపీలో గట్టి ప్రచారం ఉంది. దీనిపై ఎప్పుడైనా అధికారిక ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. అదే జరిగితే రాజ్యసభ ఆశించిన అలీకి కాస్త నిరుత్సాహమే అనుకోవచ్చు.