రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. జూన్ పదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగింటిలో ఒకరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. మిగతా ముగ్గురు బీజేపీ ఎంపీలు. అయితే ఈ నాలుగు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో ఆశావహులు ఎవరు అన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది తమకు అవకాశం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణాలలు స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలనుకుంటున్నారు. అయితే పారిశ్రామిక వేత్తల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డికి కొనసాగింపు !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా క్లారిటీ వచ్చిందంటున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిందన్న ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా ఆయనకు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కోఆర్డినేట్ చేసుకునే పదవి ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డికి మళ్లీ ప్రాధాన్యం పెరిగిందని ఆయన రాజ్యసభ స్థానానికీ ఢోకా లేదని చెబుతున్నారు.
మిగతా మూడు సీట్లు ఎవరికి ?
విజయసాయిరెడ్డికికి పోగా మిగిలిన వాటిలో రెండు సీట్లను బీసీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నా నెల్లూరు కు చెందిన టీడీపీ బీసీ నేత బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్‌సీపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి లకు రాజ్య సభ సీట్లు దక్కకున్నట్టు చెబుతున్నారు. వీరిలో కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర కు చెందిన కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన నేత.
మరొకటి అదానీ ఫ్యామిలీకి.. మరి అలీ సంగతేంటి ?
ఇక మిగిలిన సీటు ను వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి కేటాయిస్తున్నట్టు సమాచారం.అదానీ భార్య ప్రీతి .లేదా కుమారుడు జీత్ లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.అదే జరిగితే దేశంలోని ఇద్దరు ప్రముఖ వ్యాపార వేత్తలకు ఏపీ నుండి రాజ్యసభ సీట్లు దక్కినట్టు అవుతుంది. గతంలో అంబానీ సిఫార్సు మేరకు వ్యాపారవేత్త పరిమల్ నత్వానీ కి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఇటీవల సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన సీఎం జగన్‌ను కూడా కలిశారు. కానీ ఇప్పుడు ఆయన పేరు రేసులో వెనుకబడింది.