రాష్ట్రాలు వేరైయా మా దారులు ఒక్కటే.  మా మాట కూడా ఒక్కటేనంటున్నారు ఆ అన్నాచెల్లెళ్లు. పార్టీలు వేరైనా తండ్రి ఆశయాల కోసం పనిచేస్తున్నామంటున్న ఆ అన్నాచెల్లెళ్లు మాది ఒంటరిపోరని రాజకీయ పార్టీలకే కాదు నేతలకు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా అన్నాచెల్లెళ్లు అంటే వైఎస్‌ జగన్‌.. వైఎస్‌ షర్మిల. ఏపీ సీఎం జగన్‌ ప్రతిపక్షాలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఒంటరిగానే పోరాడతానని మరోసారి స్పష్టం చేశారు. ఈ మాటల వెనక ఉన్న మ్యాటర్‌ ఏంటంటే 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏపీలో అధికారాన్ని అందుకున్న జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాజకీయవేడి రోజురోజుకి పెరిగిపోతోంది. టీడీపీతో మొదలైన అధికారపార్టీ యుద్ధంలో ఇప్పుడు జనసేన, బీజేపీ , కమ్యూనిస్ట్‌ లు కూడా చేరారు. పదేపదే విపక్షాలన్నీ జగన్‌ అవినీతిని ఎత్తి చూపించడమే కాకుండా బీజేపీతో దొంగచాటుగా పొత్తుపెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో కాస్తంత దూకుడుగా వ్యవహారిస్తోంది. అవినీతి స్కాంల నుంచి తప్పించుకునేందుకు జగన్‌ మోదీతో చేతులు కలిపి ఏపీని నాశనం చేస్తున్నారని ఆరోపణలు చేస్తోంది.


అటు జనసేన కూడా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ విఫలమైందని తిట్టిపోసింది. ఎందుకు మోదీని జగన్‌ నిలదీయడం లేదని ప్రశ్నించింది. ఏపీలో బీజేపీ-వైసీపీ తెరచాటున చేతులు కలిపాయని నిన్నగాక మొన్న కమ్యూనిస్ట్‌ నేత నారాయణ కూడా విమర్శించారు. ఇలా రోజురోజుకి విపక్షాల విమర్శలు తీవ్రస్థాయికి వెళ్లడంతో వైసీపీ అధినేత స్పందించారు. జగన్‌ పొత్తు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని, ఏ పార్టీతో కూడా ఉండదని స్పష్టం చేయడమే కాదు వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఒంటరిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆ దేవుని ఆశీస్సులు, ప్రజల మద్దతుతో మేనిఫెస్టోలో చెప్పిన పథకాలే కాదు చెప్పనవి కూడా అందజేస్తూ ఈ కరోనా క్లిష్ట సమయంలోనూ వాటిని కొనసాగిస్తున్నానని స్ఫష్టం చేశారు జగన్‌.


ఇక ఆయన చెల్లెలు వైఎస్‌ షర్మిల కూడా తెలంగాణలో అధికారపార్టీతో తలపెడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు బీజేపీ బాణమంటూ టీఆర్‌ ఎస్‌ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. నాకంటూ సొంతంగా పార్టీ ఉందని, ఎవరి లబ్ది కోసమో నేను పార్టీలు పెట్టి, కుటుంబాన్ని వదిలి  పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు పాదయాత్రలో ఈ పార్టీ ఆ పార్టీ అని అన్నీ పార్టీలను ఏకి పారేస్తుంది విమర్శలతో. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఘాటుగా విమర్శిస్తోంది.  తండ్రి వైఎస్‌ సంక్షేమపాలన తిరిగి తెలంగాణలో తీసుకురావడమే తన లక్ష్యమని అందుకోసమే పార్టీ పెట్టి ప్రజల మధ్యనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు. అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డనని చులకనగా చూసినా, మాట్లాడినా ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇస్తూనే  షర్మిల కేరాఫ్‌ తెలంగాణ గడ్డా.. ప్రజలే నా అడ్డా అని  సమరశంఖం పూరిస్తోంది. ఇలా అన్నాచెల్లెళ్లిద్దరూ ఒక్క మాటతో రాజకీయప్రత్యర్థులకు తమదైన స్టైల్లో వార్నింగ్‌ ఇవ్వడం విశేషం.