Raj Thackeray and Uddhav Thackeray : ముంబైలోని వర్లిలోని NSCI డోమ్ చారిత్రాత్మక సంఘటన వేదికైంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒక్క చోట చేరారు. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రే త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఏకమై విజయ్ ర్యాలీ చేపట్టారు.
ర్యాలీలో ఏ రాజకీయ పార్టీ జెండా కనిపించలేదు. కేవలం మరాఠీ గుర్తింపు, భాష ఐక్యత కోసం చేస్తున్న పోరాటం మాత్రమేనని ఈ మీటింగ్ స్పష్టం చేసింది. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ , రాజ్ ఠాక్రే ఒక చోటకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై త్రి భాషావిధానంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, "మేము ఒక్కటవ్వడంపైనే అందరి దృష్టి ఉంది. రాజకీయ దూరాన్ని తగ్గించుకుని మేము ఐక్యమయ్యాం. మరాఠీ భాష కారణంగా మా మధ్య ఉన్న దూరం తొలగిపోయింది. ఇది అందరికీ నచ్చుతోంది, మేమిద్దరం ఒక్కటై మిమ్మల్ని(ఫడ్నవీస్) బయటకు పంపిస్తాం. మోదీ ఏ పాఠశాలలో చదువుకున్నారు? హిందుత్వాన్ని మేము వదిలిపెట్టలేదు, వదిలిపెట్టం, భాష పేరుతో గూండాగిరిని సహించబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నేను చెప్పాలనుకుంటున్నాను." అని అన్నారు.
"ఈ రోజు నా ప్రసంగం కంటే రాజ్-ఉద్ధవ్ కలిసి ముందుకు రావడమే చాలా ముఖ్యం. ఈ రోజు మన మధ్య ఉన్న విభేదాలను అనాజీ పంత్ తొలగించారు. కలిసి వచ్చాము, కలిసి ఉండటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు అందరూ నిమ్మకాయలు-మిరపకాయలు కొనడంలో(దిష్టి తీయడానికి) బిజీగా ఉన్నారు. ఈ రోజు అందరినీ(ఫడ్నవీస్, మోదీ) పెకిలించడానికి మేము ఒక్కటయ్యాము." అని ఆయన అన్నారు.
కలిసి ఎన్నికల్లో పోటీ చేసే సూచనలు
ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, "భాష పేరుతో గూండాయిజాన్ని సహించబోమని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కానీ భాష కోసం మేము గూండాలం అవుతాం." అని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, "భయాన్ని సృష్టించి మరాఠీల మధ్య చిచ్చు పెట్టారు. మేము ఒక్కటయ్యాము, చాలా జరిగింది. ఇప్పుడు వారిని పెకిలించే సమయం ఆసన్నమైంది." అని అన్నారు.
రాజ్ ఠాక్రే ఏమన్నారు?
అంతకుముందు రాజ్ ఠాక్రే సభను ప్రసంగించారు. "నేను దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రేతో వేదికను పంచుకుంటున్నాను." అని రాజ్ థాకరే అన్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బాలసాహెబ్ థాకరే చేయలేనిది, నన్ను, ఉద్ధవ్‌ను ఒకచోట చేర్చారని రాజ్ ఠాక్రే అన్నారు.
ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, "త్రిభాషా సూత్రంపై తీసుకున్న నిర్ణయం ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేయడానికి కుట్రలో ఒక భాగం. మరాఠీ ప్రజల బలమైన ఐక్యతా ఉద్యమం కారణంగా త్రిభాషా సూత్రంపై నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది."
రాజ్ ఠాక్రే ప్రసంగం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే చేయి కలిపి, వీపు తట్టి నవ్వుతూ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది.
గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని బోధించాలని నిర్ణయించింది. దీనిపై ఇద్దరు సోదరులు ఏకమయ్యారు. అయితే, తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీని తరువాత, ఇద్దరు సోదరులు విజయ ర్యాలీని నిర్వహించారు. రాజ్ ఠాక్రే 2005లో శివసేన నుంచి వైదొలిగారు. మరుసటి సంవత్సరం ఆయన ఎంఎన్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజకీయ వేదికపై ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి.
శివసేన అధికార పత్రిక సామ్నాలో ర్యాలీకి ముందు ప్రచురించిన సంపాదకీయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఠాక్రే సోదరుల ఐక్యతను "మరాఠీ శక్తి పునఃస్థాపన"గా అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం, దాని 'ఢిల్లీశ్వర్' నిరంతరం మరాఠీ ప్రజలపై దాడి చేస్తున్నాయని, ఇప్పుడు మరాఠీ ప్రజలు ఐక్యమై దానికి ప్రతిఘటించాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. రాజ్, ఉద్ధవ్ ఒకే వేదికపైకి రావడం మరాఠీ జీవితంలో 'విజయం, ఆనందం' కలగలిపిన అరుదైన క్షణంగా అభివర్ణించింది.