Telangana Congress MLAs Meet: సందర్భం: “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్”  కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. హైదరాబాద్‌లో తాను బస చేసిన హోటల్‌లో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ సీనియార్టీని గుర్తించి మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ విషయంలో అసంతృప్తికి గురయ్యారు.  పార్టీ కష్టకాలంలో ఉన్నా.. అందరూ పార్టీని వీడి పోయినా తాను పార్టీలోనే ఉన్నానని .. పార్టీని బలోపేతం చేశానని అన్నారు. పార్టీ నుంచి రెండు సార్లు వెళ్లిపోయి.. రెండు సార్లు వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చారని తనను గుర్తించలేదని.. మంత్రి పదవి ఇవ్వలేదని గట్టిగానే అడిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై మల్లిఖార్జున్ ఖర్గే సామాజిక సమీకరణాలతో ఇవ్వడం కుదరడం లేదని చీఫ్ విప్ పదవి తీసుకోవాలని కోరినట్లుగా చెబుతున్నారు. అయితే ప్రేమ్ సాగర్ మాత్రం ఆగ్రహంతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం భట్టి ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా.. సఫలం కాలేదు. 

అలాగే మంత్రి పదవుల్ని గట్టిగా ఆశిస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు బంజారా ఎమ్మెల్యేలు, మరికొంత మంది ఇతరులు కలిశారు. రెడ్డి సామాజికవర్గానికి ఇక చాన్స్స ఉండదని ఖర్గే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదకిగా అవకాశాలు కల్పించాలని కొంత మంది కోరారు. ఒక్కో జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని.. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాకు మంత్రులు లేరని గుర్తు చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే, సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి.. .సీనియర్లను గుర్తించాలని కోరారు. గ్రేటర్ పరిధిలో గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కోరారు. బంజారాలకు అవకాశం ఇవ్వాలని బాలరాజు కోరారు. అయితే ఎవరికీ ఖర్గే హామీ ఇవ్వలేదు. కొంత మందికి మాత్రం మంత్రి పదవులు లేవని ఇతర పదవులు  తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. 

ఎల్బీ స్టేడియంలో జరిగే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను పటిష్టం చేసే కార్యక్రమాల్లో భాగంగా, తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని నేరుగా కలిసేందుకు  ఎల్పీ స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేశారు.  జిల్లా, బ్లాక్, గ్రామ అధ్యక్షులను ఈ సమావేశం ద్వారా ఖర్గే నేరుగా కలవనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించడం, సంస్థాగత లోపాలను సరిదిద్దేలా మార్గనిర్దేశం చేయడం, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే వ్యూహాలను  చర్చిస్తారు.  అంతకు ముందు  గాంధీ భవన్‌లోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం, పీసీసీ చీఫ్, సీనియర్ మంత్రులు సహా టీపీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. ఈ సమావేశంలో వారి నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు స్వీకరిస్తారు. పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సంసిద్ధం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. పార్టీలో ఐక్యతను, క్రమశిక్షణను పెంపొందించేలా అఖిల భారత అధ్యక్షుడు ఖర్గే పలు సూచనలు చేసే అవకాశం ఉంది.