ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీల కోసం పనిచేయడం లేదని, ప్రధాన సమస్యల నుంచి వారిని మళ్లించి తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయడం మోదీ చేతకాదన్నారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ఓబీసీలు అని, బీజేపీకి చెందిన పది మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఓబీసీ అని రాహుల్‌ అన్నారు. ఓబీసీ వర్గం నుంచి ఎంత మంది బీజేపీ సీఎంలు ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఈరోజు దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ మోదీ పై, బీజేపీ పై విమర్శలు చేశారు. ఈ మీటింగ్‌లో దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ తీర్మానాన్ని ఆమోదించింది.


సీడబ్యుసీ సమావేశం తర్వాత రాహుల్‌ గాంధీ విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రజలు కుల గణనను కోరుకుంటున్నారని, కాబట్టి కుల గణన చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై ఒత్తిడి చేస్తుందని చెప్పారు. 'దేశం కోరుకుంటున్నందున కుల గణనను నిర్వహించాలని మేము బిజెపిపై ఒత్తిడి తెస్తాము. I.N.D.I.A కూటమికి సంబంధించినంతవరకు, చాలా పార్టీలు దీనికి మద్దతు ఇస్తాయని నేను భావిస్తున్నాను. దానికి మద్దతు ఇవ్వని కొన్ని పార్టీలు మాత్రమే ఉండవచ్చు, కానీ దాని వల్ల ఏ సమస్య లేదు" అని గాంధీ చెప్పారు. 


అలాగే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కుల గణన నిర్వహించాలని కాంగ్రెస్ సీఎంలు నిర్ణయించారని రాహుల్‌ వెల్లడించారు. తాము కుల గణనపై చర్చ నిర్వహించి ఏకగ్రీవంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుల గణన పేదల కోసమే అని ఆయన పేర్కొన్నారు. ఇది కులం, మతానికి సంబంధించినది కాదని, పేదరికానికి సంబంధించిదని తెలిపారు. తాము కుల గణనతో ఆగకుండా తర్వాత ఆర్థిక సర్వే కూడా చేయిస్తామని తెలిపారు.


ప్రధాని నిరాధారమైన ఆరోపణలు పెరుగుతాయి: సీడబ్ల్యుసీలో ఖర్గే


కాంగ్రెస్‌ పార్టీపై రానున్న రోజుల్లో  ప్రధాని మెదీ అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన నిరాధారమైన ఆరోపణలు మరింత పెరుగుతాయని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. సీడబ్ల్యుసీలో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. అబద్ధాలను ఎదుర్కోవడానికి నాయకులు సిద్ధంగా ఉండడం చాలా అవసరమని చెప్పారు. మణిపూర్‌ పరిస్థితిని వదిలేసి మోదీ తరచూ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాలని ఖర్గే కార్యకర్తలను కోరారు. 


అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వారి జనాభాకు అనుగుణంగా సామాజిక న్యాయం కల్పించేందుకు దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై బీజేపీ మౌనంగా ఉంటుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో సరైన భాగస్వామ్యం కోసం సమాజంలో బలహీన వర్గాల సామాజిక- ఆర్థిక వివరాలు ఉండడం చాలా అవసరమని, వారికి న్యాయం చేయడానికి ఇది తోడ్పడుతుందని ఖర్గే పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే అమలు చేస్తామని ఖర్గే అన్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, మిజోరాంలలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమర్థమైన వ్యూహం అవసరమని ఆయన తెలిపారు.