ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అన్నింటి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ధీటుగా ఎలా ఎదగాలి.. కేంద్రంలో మళ్లీ ఎలా అధికారం చేపట్టాలి అన్న అంశంపై ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో బలం పెద్దగా లేని రాష్ట్రాల్లో ఏం చేయాలన్న అంశంపైనా రిపోర్ట్‌ ఉంది. కొన్ని పార్టీలతో కలిసి పోటీ చేయాలని.. మరికొన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ నివేదిక సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని పీకే సిఫార్సు చేసినట్లుగా వెల్లడి కావడం ఏపీలో రాజకీయ సంచలనానికి కారణం అవుతోంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్‌కూ వైఎస్ఆర్‌సీపీతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇంకా స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారన్న ప్రచారమూ ఉంది . బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కించాలని పట్టుదలగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కోసం చతురంగబలాలను సమీకరిస్తున్నారు. ఆ బలాల్లో వైఎస్ఆర్‌సీపీ చేరడమే అనూహ్య పరిణామం. 


కాంగ్రెస్‌తో పొత్తుకు వైఎస్ఆర్‌సీపీ ఒప్పుకుంటుందా ?


ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని.. కలసి పోటీ చేయాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌కు సూచించారు.  కాంగ్రెస్ ఒప్పుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా లేదా అన్నది పరిశీలించాలి. ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్న వేస్తే.. వంద శాంత  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో చెబుతుంది. కాంగ్రెస్ పొడే తమకు గిట్టదని చెబుతుంది. తమ పార్టీ పేరులోనే కాంగ్రెస్ అని ఉన్నా..కాంగ్రెస్ పార్టీ నుంచి తాము ఓ విడిపోయామనే సంగతి కళ్ల ఎదురుగానే ఉన్నా.. తమకు  బద్దశత్రువు కాంగ్రెస్ అనే చెబుతారు. అదే సమయంలో భారతీయ జనతాపార్టీతో  అంత ఖరాఖండిగా తమ సంబంధాలను ఖండించలేరు. అలాగని.. ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటారా..లేకపోతే ఎన్డీఏలో చేరి కేంద్రమంత్రి పదవులు తీసుకుంటారా అంటే.. అలాంటి పనులు కూడా చేయలేరు . ఎందుకంటే అది రాజకీయంగా ఆత్మహత్యా సదృశం అవుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్‌సీపీకి ఏకపక్షంగా మద్దతు పలికే ముస్లింలు, దళితవర్గాల వారు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగని బీజేపీని శత్రువుగా చూడలేని పరిస్థితి.  ఇప్పటికిప్పుడు చూసుకుంటే కాంగ్రెస్‌తో పొత్తు అనే ఆలోచన వైఎస్ఆర్‌సీపీ చేసే అవకాశమే లేదు.


భవిష్యత్ పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ ఆలోచించారా ?


వైఎస్ఆర్‌సీపీని ప్రశాంత్ కిషోర్ గెలిపించారని సీఎం జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం పీకే వైఎస్ఆర్‌సీపీ కోసంపని చేస్తారని ఆయన గతంలో తన కేబినెట్ సహచరులకు చెప్పినట్లుగా కూడా  ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పీకే లేదా ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం వైఎస్ఆర్‌సీపీకి సేవలు అందిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ తో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. పీకే వ్యూహాలపై జగన్‌కు గురి ఉంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని .. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏర్పడితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ... కాంగ్రెస్‌కు దగ్గర చేయడానికి ఎంతో సమయం పట్టదు


కాంగ్రెస్‌తో పొత్తు వల్ల  వైఎస్ఆర్‌సీపికి లాభం ఉంటుందా  ?


ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండే వర్గాలన్నీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరిన తర్వాత తన వ్యూహాలు అమలు చేసి.. ఎంతో కొంత పాజిటివ్ వేవ్‌ను తీసుకు వస్తే. ఎంతో కొంత ఓట్ల శాతం పెరుగుతుంది. అది వైఎస్ఆర్‌సీపీదే అవుతుందనే అంచనా ఉంది. ప్రతిపక్షంలో ఉండటం వేరు.. అధికార పక్షంలో ఉండటం వేరు .. అధికారంలో ఉంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. లేకపోతే అధికార వ్యతిరేకత వస్తుంది. అది కూడా ప్రభావం చూపితే మరింత ఓటు  బ్యాంక్ లాస్ అవుతుంది. అలాంటి  పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు వైఎస్ఆర్‌సీపీకి మేలు జరుగుతుంది.
 
మొత్తంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇచ్చిన బ్లూప్రింట్‌లో పేర్కొన్న విషయాలు అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.