పుట్టిన రోజు నాడు దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన చంద్రబాబు  శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలు ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారని..ఇన్నాళ్లు ఆయనకు అవి లేవా అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.  పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ కూలిపోయిందని ప్రభుత్వంపై రూ.800 కోట్ల భారం వేశారని చంద్రబాబు అంటున్నారని.. ఇది ఆయన  హయాంలో జరిగిన అక్రమమేని సజ్జల ఆరోపించారు. స్పిల్‌వే పూర్తి చేయకుండానే కుడి, ఎడమ కాఫర్‌డ్యామ్‌లు మ«ధ్యలో వదిలేసి కట్టి, కొన్ని నీళ్లు నిల్వ చేయడం వల్లనే డయాఫ్రమ్‌ వాల్‌ కూలిపోయిందన్నారు. దీనికి 100 శాతం బాధ్యత  చంద్రబాబుదే అయినా జగన్ పై వేస్తున్నారన్నారు . మళ్లీ డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాలంటే మళ్లీ నీళ్లు తోడాలని .. ఎలా కట్టాలో కూడా నిపుణులకు అర్ధం కావడం లేదని సజ్జల తెలిపారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే చంద్రబాబు ఆ పనులను అస్తవ్యస్తం చేశారని  ఆరోపించారు.  
 
ఒంగోలులో ఆర్టీఏ అధికారులు ఒక వాహనాన్ని సీఎం కాన్వాయి కోసం స్వాధీనం చేసుకున్నారన్న విషయంలోనూ చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆ విషయం తెలియగానే జగన్ స్పందించారని ఇద్దర్ని సస్పెండ్ చేశారని అయినా కూడా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.   ‘ఎవరైనా అమ్మాయిని తీసుకు రమ్మంటే ఇంట్లో నుంచి లాక్కుని వస్తారా? అని పోలుస్తూ మాట్లాడడం అతి దారుణమని సజ్జల వ్యాఖ్యానించారు.  ఎవరో కింద ఉద్యోగి చేసిన తప్పిదాన్ని, పెద్దగా చూపి, రాష్ట్రంలో ఏదో జరిగినట్లు చెప్పడం కరెక్ట్ కాదన్నారు.  ఉన్మాదిలా మారిన చంద్రబాబు బరితెగించి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. 


 ప్రభుత్వాధినేతగా 14 ఏళ్లలో చేసిన అరాచకాలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. నవనిర్మాఱ దీక్షలు, ధర్మ పోరాట దీక్షల పేరుతో చేసిన దారుణాలను జనం ఇంకా మర్చిపోలేదన్నారు.  ఒక వైపు వందల కోట్లు వ్యయం. మరోవైపు ఎక్కడ దీక్ష జరిగితే ఆ రోజు అక్కడ స్కూళ్లన్నీ మూత వేయించారని.. బస్సులు, ఆటోలు బలవంతంగా మళ్లించారన్నారు.    అప్పుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదన్నారు. తమది  బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే, ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నారని సజ్జల చెప్పారు. అన్నింటినీ జగన్ చక్కదిద్దుతున్నారని  రాజకీయ పదవులు, మంత్రి పదవుల్లో పూర్తి సామాజిక న్యాయం పాటించారన్నారు.  


 రైతులు ఉరి వేసుకోవద్దు. వైయస్సార్‌సీపీకి ఉరి వేయాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారని..  ఈ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తోందన్నారు. మూడేళ్లు కూడా పూర్తి కాకముందే పెట్టుబడి సాయంగా రూ.20 వేలకు పైగా కోట్లు రైతుల ఖాతాల్లో వేసిందని సజ్జల తెలిపారు. అలాగే కౌలు రైతులకు కూడా అన్ని పథకాలు వర్తింప చేస్తున్నామని  విత్తనం మొదలు పంటలు అమ్ముకునే వరకు అడుగడుగునా అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయన్నారు.  కానీ అదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణ మాఫీ చేస్తానని మాట ఇచ్చి తప్పారన్నారు.  
 
ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరిగిపోతోందన్నట్లుగా విమర్శలు చేయడం.. కార్యక్రమాలు నిర్వహించడం అలవాటుగా మారిందన్నారు. తాజాగా రేషన్‌ బియ్యంపైనా అదే విమర్శ. బియ్యం వద్దనుకుంటున్న వారికి నగదు ఇవ్వాలన్న ఆలోచనపై, ప్రయోత్మాకంగా మొదలు పెట్టకముందే చంద్రబాబు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.