Prakasam News: వాణిజ్య పంటలకు, గ్రానైట్ వ్యాపారానికి పెట్టింది పేరైన ప్రకాశం జిల్లాలో ఈసారి ఎన్నికల పోటీ రెండు పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఇరుపార్టీలు పోటీకి దింపాయి. కోటీశ్వరుల మధ్య జరిగే పోటీలో ఈసారి ఎవరిది పై చేయి సాధించేనో...


గ్రానైట్‌ 'ఘనులు'


చీమకుర్తి గ్రానైట్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. తరాల తరబడి తవ్వినా తరగని గనులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్క ఎకరంలో గ్రానైట్ క్వారీ పడిందంటే చాలు... కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. అలాంటిది వందల ఎకరాలు విస్తరించి ఉన్న గ్రానైట్ క్వారీలు కలిగి ఉన్న యజమానులే ఇక్కడ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. జిల్లాలోనే గ్రానైట్‌ కింగ్‌గా పేరు గాంచిన గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi) తెలుగుదేశం(Telugudesam) పార్టీ నుంచి మరోసారి అద్దంకి(Adhanki) ఎమ్మెల్యేగా పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లోనూ తెలుగుదేశం నుంచి గెలుపొందిన ఆయన ఈసారి కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి గొట్టిపాటి రవి ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం ఆయన ఆస్తులు రూ.58.38 కోట్లు ఉంది. వివిధ బ్యాంకుల్లో ఉన్న క్యాష్, బాండ్లు, షేర్లు, పర్సనల్ లోన్ అడ్వాన్స్ అన్నీ కలిపి రూ.18 కోట్లు ఉన్నాయి. వంద ఎకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి విలువ రూ.ఎనిమిదిన్నర కోట్లు ఉంది. ఈ భూముల్లోనే ఆయన గ్రానైట్ క్వారీలు ఉండటంతో వాస్తవంగా వీటి విలువ రూ.వేల కోట్లలోనే ఉంటుందని వినికిడి. వ్యవసాయేతర భూమి కూడా పెద్దఎత్తున ఉంది. వీటి విలువ సైతం రూ.30 కోట్లు ఉంటుందని  అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కమర్షియల్ బిల్డింగ్‌లు, ఇల్లు అన్నీ కలిపి స్థిరాస్తుల విలువ రూ.40 కోట్లు ఉందని ఆయన తెలిపారు. వివిధ బ్యాంకుల నుంచి రవి తీసుకున్న అప్పు మరో రూ.13 కోట్లుగా ఉంది.


మరో గ్రానైట్ వ్యాపారి శిద్దా రాఘవరావు(Siddha Raghavarao) సైతం రూ.వంద కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టారు. ఆయన బ్యాంకు బ్యాలెన్స్ డిపాజిట్లు కలిపి రెండున్నర కోట్లు ఉండగా...బాండ్లు, షేర్ల రూపంలో మరో రూ.22 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. మొత్తం చరాస్తుల విలువ రూ.31 కోట్లు ఉండగా....వ్యవసాయ భూమి విలువ రూ.15 కోట్లు ఉంది. ఈ భూముల్లోనే ఆయన గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటి విలువ కూడా రూ.వందల కోట్లు ఉండే అవకాశం ఉంది. రూ.22 కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూములు ఉన్నాయి. చీమకుర్తి(Chimakurty), ఒంగోలు(Ongole)లో ఏడున్నర కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. చీమకుర్తి, ఒంగోలు, హైదరాబాద్‌(Hyderabad)లోనూ 11 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఆయన పేరిట ఉన్నాయి. మొత్తం ఆయన స్థిర ఆస్తుల విలువ 60 కోట్లకు పైమాటే. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 18.50 కోట్లు ఉంది.


వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి(Balineni Srinivasula Reddy) ఆస్తి రూ.4 కోట్లు పైనే ఉండగా... అప్పులు దాదాపు కోటి రూపాయల వరకు ఉన్నాయి. బ్యాంకు బ్యాలెన్స్‌, డిపాజిట్లు, బాండ్లు అన్నీ కలిపి దాదాపు 50 లక్షల వరకు ఉండగా...మరో 50 లక్షల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయి. కోటీ 25 లక్షల విలువైన స్థలాలతోపాటు కోటిన్నర విలువైన ఇళ్లు కలిపి మొత్తం స్థిరాస్తి విలువ మూడు కోట్ల 70 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయి. బాలినేనిపై పోటీ చేసి ఓడిపోయిన తెలుగుదేశం నేత దామచర్ల జనార్థన్(Dhamacharla Janardhan) ఆస్తులు దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉండటం విశేషం. అప్పులు కేవలం రూ.66 లక్షలు మాత్రమే ఉన్నాయి. మంత్రి మేరుగ నాగార్జున(Meruga Nagarjun)కు రూ.57 లక్షల విలువైన ఆస్తులతో పాటు రూ.50 వేల విలువైన అప్పులు ఉన్నాయి. బ్యాంకులో క్యాష్‌, బాండ్లు కలిపి పదిన్నర లక్షలు ఉండగా... రూ.25 లక్షల విలువైన వ్యవసాయ భూమితో పాటు వైజాగ్‌(Vizag)లో మరో రూ.23 లక్షల విలువైన ఇళ్లు రెండు ఉన్నాయి. మొత్తం విలువ 47 లక్షలు కాగా.. రూ.50 వేల విలువైన బ్యాంకు లోన్లు ఉన్నాయి.


మరో మంత్రి ఆదిమూలపు సురేశ్‌(Adhimulam Suresh)కు రూ.16 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా... దాదాపు రూ.4 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయి. బాండ్లు, షేర్లు, వాహనాలు, బంగారం అన్నీ కలిపి 3 కోట్ల 45 లక్షల విలువైన చరాస్తులు ఉండగా.. రూ.5 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, రూ.2 కోట్ల విలువైన స్థలాలు, రూ.6 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 12 కోట్ల 75 లక్షలుగా ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుుకున్న అప్పులు 2 కోట్ల 74 లక్షలు ఉంది. వైసీపీ తరఫున ఎంపీగా పోటీపడుతున్న చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి(Chevireddy Bhaskar Reddy)కి మూడున్నర కోట్ల ఆస్తి ఉండగా... 82 లక్షల అప్పు ఉంది. తెలుగుదేశం నుంచి ఇంకా అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది.