Tdp Incharge Varma Meet With Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టీడీపీ ఇంఛార్జీ ఎస్వీఎస్ఎన్ వర్మ (Varma) స్పష్టం చేశారు. జనసేన (Janasena) పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వర్మతో పాటు.. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జీలు సుజయకృష్ణ రంగారావు పవన్ తో భేటీ అయ్యారు. పిఠాపురంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వారు పవన్ కు వివరించారు. మూడు పార్టీలు సమన్వయంతో కలిసి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. త్వరలోనే పిఠాపురం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నట్లు జనసేనాని వారికి వివరించారు.
వారాహి వాహనం నుంచే..
వారాహి వాహనం నుంచి పిఠాపురం కేంద్రంగానే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. శక్తిపీఠం కొలువైన స్థలం.. శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని జనసేనాని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేశారు. పవన్ 3 రోజులు పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. పురుహూతికా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్నారు.
చంద్రబాబు 'ప్రజాగళం' షెడ్యూల్
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి 'ప్రజాగళం' (Prajagalam) పేరిట ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ నెల 31 వరకూ వివిధ సభలు, రోడ్ షోలు, నియోజకవర్గాల పర్యటనల్లో ఆయన పాల్గొననున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు, పర్యటన సాగేలా షెడ్యూల్ రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటన ఉండనుంది. అనంతరం సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆదివారం తాడేపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖి నిర్వహించారు.
Also Read: Nara Lokesh: ఒకే రోజు రెండుసార్లు కాన్వాయ్ తనిఖీ - పోలీసుల తీరుపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం