Pawan On Ysrcp : ఎన్నికల యాత్ర కోసం తాను సిద్ధం చేసుకున్న వారాహి వాహనంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేయడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా తీసుకున్నారు. వాహనానికి వేసిన రంగు చట్ట విరుద్దమని.. చెల్లదని.. ఆర్టీఏ అనుమతి ఇవ్వదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పలువురు వైఎస్ఆర్‌ీపీ నేతలు అదే చెబుతున్నారు. దీనిపై జనసేన సీనియర్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తమకు చట్టాలు తెలియవా అని ప్రశ్నించారు. అంతా చట్ట ప్రకారమే ఛేశామన్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ రోజంతా .. వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉదయమే అలీవ్ గ్రీన్ కలర్ షర్ట్‌ను పోస్ట్ చేసి.. కనీసం తాను ఈ చొక్కానైనా వేసుకోనిస్తారా అని ప్రశ్నించారు.
తరవాత విశాఖలోని ఓ పచ్చన ప్రాంతాన్ని చూపించి ఇలాంటి గ్రీన్ అయితే మీకు ఇష్టమేనా అని పోస్ట్ చేశారు. అది వైజాగ్ స్టేడియం పక్కన ఉన్న స్థలంగా భావిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పి.. ఆ ప్రాంతంలో ఉన్న పచ్చదనం మొత్తాన్ని కట్ చేసేశారు. విశాలమైన స్థలంగా మార్చారు. దీన్నే సెటైరిక్‌గా పవన్ కల్యాణ్ గుర్తు చేశారని భావిస్తున్నారు.
తర్వాత పవన్ కల్యాణ్‌కు మాత్రమే రూల్స్ అమలు చేస్తారా అని అలీవ్ గ్రీన్ కలర్‌లో ఉన్న కొన్ని వాహనాల ఫోటోలను పోస్ట్ చేశారు.
ఈర్ష్యతో వైసీపీ రోజు రోజుకు కుంచించుకుపోతోందని మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత టిక్కెట్ రేట్లు.. రంగులు వంటి వాటి మీద కాదని..అభివృద్ధి పై దృష్టి సారించాలని సూచించారు.
పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్‌సీపీ తన విషయంలో అన్నింటినీ వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. అందుకో రోజంతా ట్వీట్లు చేసినట్లుగా చెబుతున్నారు.