Konaseema Crop Holiday Pawan Reaction : కోనసీమ రైతులు క్రాప్ హాలీడే ప్రకటించడం రాజకీయంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం ఏ విధంగానూ సహకరించడం లేదన్న కారణంతో కోనసీమ జిల్లాలోని రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రైతులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రభుత్వమేనని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన డబ్బులు సకారంలో చెల్లించరు, డ్రెయిన్లు, కాలువల నిర్వహణ పట్టించుకోరు.. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరు.. ఇలాంటి ఇబ్బందులన్నీ పెట్టడం వల్లనే రైతులు క్రాప్ హాలీడే వంటి కీలక నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
ప్రభుత్వ చేతకాని తనం వల్లే 11 ఏళ్ల తర్వాత కోనసీమలో పంట విరామం
అన్నం పెట్టే రైతు కోసమే ఏ పథకాలైనా ఉంటాయని అలాంటి రైతు పంట పండించబోమని చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 11 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి పునరావృతం కావడం దురదృష్టకమని.. 2011లో కోనసీమ రైతులు ప్రకటించిన క్రాప్ హాలీడే దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు. అప్పట్లో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించడంతో 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు వచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రబీ సీజన్ ధాన్యం డబ్బులు ఇంకా చెల్లించాల్సి ఉందన్న పవన్
కోనసీమ రైతులు క్రాప్ హాలీడే ప్రకటించగానే ప్రభుత్వం భయపడి ధాన్యం డబ్బులు జమ చేసిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ. 475 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. రైతులు క్రాప్ హాలీడే ప్రకటించడంతో హడావుడిగా రూ. 139 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని పవన్ తెలిపారు. తొలకరి పంటకు సరైన సమయంలో నీైరు అందకపోతే తుపాన్ల బెడద ఉంటుందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
సమస్యలను ప్రస్తావిస్తే రాజకీయ ముద్ర వేస్తారా ?
పంట విరామం ప్రకటించిన రైతులపై వైఎస్ఆర్‌సీపీ నేతలు రాజకీయ విమర్శలు చేయడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సమస్యలపై స్పందించిన ప్రతి ఒకరిపై ఇలాగే దాడి చేస్తున్నారని విమర్శించారు. వారిపై రాజకీయ ముద్ర వేయడం దారుణమని.. రైతుల పోరాటానికి జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.