What Is KCR Plan :  రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అందరి చర్చ అభ్యర్థులు ఎవరు అనే దానిపైనే. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంగా గతంలో రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై చర్చ జరిగింది. రెండు నెలల్లో సంచలనం నమోదవుతుందని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఆ సంచలనం రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల అభ్యర్థిని గెలిపించడమే అనుకున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హాజరానే అభ్యర్థిగా నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. కానీ కర్ణాటకకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన మళ్లీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. 


విపక్ష అభ్యర్థిని నిలబెట్టే అంశంపై కేసీఆర్ వెనక్కి తగ్గారా ?
 
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తే అంతకు మించిన సంచలనం ఏమీ ఉండదు. కేసీఆర్ .. ఆ దిశగా ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు.  విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారానే నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మహారాష్ట్రలోని అన్నా హాజరే స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి వెళ్లి ఆయనతో మాట్లాడి ఒప్పించాలని అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ ఇంకా వెళ్లలేదు. నోటిఫికేషన్ వచ్చినందున ఆయన అదే వ్యూహం అమలు చేయాలనుకుంటే రాలేగాన్ సిద్ధికి వెళ్లే అవకాశం ఉంది. కానీ అలాంటి సూచనలేం లేవని టీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి. 


గతంలో పలువురు నేతలతో చర్చలు ! 
 
అన్నాహజారే కాంగ్రెస్ హాయంలో అవినీతి వ్యతిరేక పోరాటం.. లోక్ పాల్ బిల్లు కోసం చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది.  ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ పోరాటం నుంచే వచ్చారు. అన్నా హజారే నేరుగా రాజకీయాల్లోకి రాలేదు.  ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్‌తోనూ ఈ అంశంపై కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. దేవేగౌడ, కుమారస్వామితోనూ ఇదే టాపిక్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు .   బీహార్ వెళ్లి ఎన్డీఏ మిత్రపక్షం.. అయిన జేడీయూ నేత .. సీఎం నితీష్ కుమార్‌తోనూ మాట్లాడాలనుకుంటున్నారు. అయితే ఈ టూర్ ఉంటుందా ఉండదా అన్నదానిపై స్పష్టత లేదు. 


స్పందన లేకపోవడంతో దూరంగా ఉండటమే బెటరని అనుకుంటున్నారా ?


ఎంత ప్రయత్నించినా పరిస్థితి ఆశాజనకంగా మారకపోవడంతో వీలైనంత సైలెంట్‌గా ఉండటమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వకపోయినా ఎన్నికకు దూరంగా ఉంటే చాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకూ తీవ్ర విమర్శలు చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తే ఇబ్బందికరమే. అలాగని అభ్యర్థిని నిలబెట్టేలని పరిస్థితి.. విపక్షాలు .. కాంగ్రెస్ లాంటి పార్టీ నిలబెడితే మద్దతివ్వడం కూడా కష్టమని.. కేసీఆర్ కు ఇష్టమైన వ్యూహం మౌనంగా ఉండటం .. దాన్ని పాటిస్తే చాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.