Pawan Vs BJP :  రెండు నెలల కిందటే భారతీయ జనతా పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. పవన్ కల్యాణ్ స్పందన అంటూ దాసోజు శ్రవణ్‌కు ఓ సందేశం పంపింది. దాసోజు శ్రవణ్ సామర్థ్యం ఉన్న నాయకుడని.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసమే నాడు పీఆర్పీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారన్నారు. ఏ పార్టీలో ఉన్నా అతని శక్తి సామర్త్యాలను గుర్తించాలని పవన్ కల్యాణ్ కోరుకున్నారు. బెస్ట్ విషెష్ చెప్పారు. పవన్ కల్యాణ్ స్పందన ఇప్పుడు వైరల్ అవుతోంది. 





భారతీయ జనతా పార్టీకి ఓ నేత రాజీనామా చేస్తే.. పవన్ కల్యాణ్ ఇలా సంతోషంగా స్పందించడం ఏమిటనేది .. తెలంగాణలోని రాజకీయ నేతలకు పజిల్‌గా మారింది. ముఖ్యంగా బీజేపీ నేతలు పవన్ స్పందనను ఆశ్చర్యంగా చూస్తున్నారు. తెలంగాణ  బీజేపీ నేతలు గతంలో పవన్ కల్యాణ్‌ను అవమానించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కోసం పోటీ నుంచి విరమించుకున్నా... తర్వాత అవమానించారని జనసేన వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో రాజకీయాలు కూడా మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ సహకారంపై అసంతృప్తితో ఉన్న ఆయన... తెలుగుదేశం పార్టీతో జత కట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందన పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 


అయితే ఇందులో బీజేపీ కోణం ఏమీ లేదని.. పవన్ కల్యాణ్ కేవలం.. తన స్నేహితుడికి శుభాకాంక్షలు మాత్రమే చెప్పారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దాసోజు శ్రవణ్ .. పీఆర్పీ పెట్టినప్పుడు కీలక నేతగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి రాజకీయంగా పయనించారు. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు కానీ ఆయనంటే..  ఆయన  రాజకీయ భావాలంటే పవన్ కల్యాణ్‌కు ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని పలుమార్లు చెప్పారు. దాసోజు శ్రవణ్ లాంటి రాజకీయ నాయకుడికి సామాజికవర్గం పేరుతో రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించడం లేదని చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇదంతా వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న స్నేహం కారణంగానేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 



ఇక్కడ  బీజేపీకి రాజీనామా చేసినందున..  దాసోజు శ్రవణ్‌ను అభినందించారన్న అభిప్రాయం రావడానికి అవకాశం లేదని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ వియాన్ని ట్వీట్‌లోనే స్పష్టంగా చెప్పారని గుర్తు చేస్తున్నారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం... తెలంగాణ కోసమే ఆయన పీఆర్పీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లారని .. ఇప్పుడు మళ్లీ అదే పార్టీలోకి వెళ్తున్నారని ..  ఆ విషయం మాత్రమే పవన్ చెప్పారంటున్నారు. కారణం ఏదైనా.. పవన్ కల్యాణ్ స్పందన మాత్రం బీజేపీ నేతలకు కాస్త ఇబ్బందికరంగానే ఉంది.