YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాళేశ్వరంలో అవినీతిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లకుపైగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన ఆమె సీబీఐ డైరక్టర్‌ను కలిసి కాళేస్వరం అవినీతిపై ఆధారాలిచ్చారు. ఇప్పుడు మరోసారి కాగ్ కు ఫిర్యాదు చేశారు. కాగ్ ఛైర్మన్ గిరీశ్ చంద్ర ముర్మును కలిసి స్వయంగా షర్మిల ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కాగ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలు ఆధారాలను కూడా కాగ్‌కు షర్మిల సమర్పించినట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్ కేటాయించిన అంశంపై కాగ్‌కు వివరాలు అందించినట్లు వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు సార్లు కాళేశ్వరంపై ఫిర్యాదు చేయడానికే ఆమె పాదయాత్రను నిలిపివేసి ఢిల్లీకి వచ్చారు.
వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాలన్న షర్మిల
వైఎస్ఆర్ కుటుంబసభ్యురాలు కావడంతో వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఆమె స్పందనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన కుటుంబంలో జరిగిన ఘోరం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. సునీతకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో.. వాళ్లకి శిక్ష పడాలన్నారు. దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని షర్మిల పేర్కొన్నారు. దర్యాప్తును ఇతర రాష్ట్రానికి తరలించడాన్ని సమర్థించారు. వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల ఇప్పటికే సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయాన్ని చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం .. వివేకా హత్య కేసు విషయంలో వాంగ్మూలం ఇచ్చారో లేదో స్పష్టత ఇవ్వలేదు.
కాళేశ్వరంపై వరుస ఫిర్యాదులు
అయితే తెలంగాణ రాజకీయాల్లో సీరియస్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల.. కాళేశ్వరం కాంట్రాక్టర్ అయిన మేఘా కృష్ణారెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌తో కుమ్మక్కు అయి వేల కోట్లు దోచుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మేఘా , కేసీఆర్ బంధం టార్గెట్ గానే.. ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆమె ఢిల్లీలో సీబీఐ డైరక్టర్, కాగ్ వంటి పెద్దల అపాయింట్‌మెంట్లు కూడా సులువుగా లభిస్తున్నాయని.. బీజేపీ నేతలు షర్మిలకు సహకరిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందరిపై ఘాటు విమర్శలు చేస్తున్న షర్మిల బీజేపీ విషయంలో మాత్రం సాఫ్ట్ గానే వ్యవహరిస్తున్నారు.
సోదరుడు జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న షర్మిల
వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని వస్తున్న ఆరోపణల విషయంలోనూ.. షర్మిల సూటిగా స్పందించారు. సోదరుడు జగన్‌తో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో .. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించడాన్ని సమర్థించడం.. గతంలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి ఆపేరు తీసేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడాన్నీ వ్యతిరేకించారు. దీంతో జగన్‌కు భిన్నమైన ధోరణిలో షర్మిల రాజకీయాలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.