Tamil Nadu Vs Center: తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య జురుగుతున్న లాంగ్వేజ్ వార్ ఇవాళ పార్లమెంట్‌ను కుదిపేసింది. త్రిభాషా విధానం పేరుతో  బలవంతంగా హిందీని తమపై రుద్దితే సహించేది లేదంటూ తమిళనాడు కొంతకాలంగా అభ్యంతరం చెబుతోంది. National Education Policy పై పార్లమెంట్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ లోపల, వెలుపల కూడా మంటలు రేపాయి. ఈ వివాదంపై  ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. తమిళనాడు అధికార పార్టీ DMK అక్కడి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, వాళ్లు అప్రజాస్వామికంగా అనాగరికంగా (Uncivilised) గా వ్యవహరిస్తున్నారని” చేసిన వ్యాఖ్యలు అగ్గిని రాజేశాయి. దీనిపై డీఎంకే అభ్యంతరాలతో ఆయన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో వాటిని లోక్‌సభ రికార్డ్స్ నుంచి తొలగించారు.


ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలివి


“డీఎంకేకు నిజాయతీలేదు. వాళ్లకి తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత లేదు. విద్యార్థుల భవిష్యత్‌ను పాడు చేస్తున్నారు. లాంగ్వేజ్ పేరుతో అడ్డంకులు సృష్టించడమొక్కటే వాళ్లకి తెలుసు. వాళ్లు దురుద్దేశపూర్వక రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లు  Undemocratic and Uncivilised”


అంతకు ముందు ఆయన మాట్లాడుతూ NEPకి మొదట తమిళనాడు ఒప్పుకుంది. ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి మూడు భాషల విధానానికి కూడా అంగీకరించారు. ఆ తర్వాత ఆయన స్టాలిన్‌తో సమావేశం అయ్యాక మొత్తం మారిపోయింది. వచ్చే ఏడాది ఎన్నికలకు వాళ్లకు ఓ ఎమోషనల్ స్లోగన్ కావాలి. అందుకే దీనిని వాడుకుంటున్నారు. అని విమర్శించారు.


ఆగ్రహించిన స్టాలిన్


కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ మండిపడ్డారు.  నిరంకుశంగా హిందీని దక్షణాదిపై రుద్దడమే ప్రధాన అజెండాగా  కేంద్రం పనిచేస్తోందని విమర్శిస్తున్న ఆయన X వేదికగా కేంద్రమంత్రిని హెచ్చరించారు. “మాటల జాగ్రత్తగా మాట్లాడాలి. కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రి తనకు తాను ఏదైనా మాట్లాడగలిగే రాజుగా భానిస్తున్నారేమో.. ఆయనకు క్రమశిక్షణ అవసరం ” అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని ప్రశ్నిస్తూ.. మోదీని కూడా ట్యాగ్ చేశారు. “నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి తాము ఎన్నడూ అంగీకరించలేదని.. ఏ విధమైన ఒత్తిడిని అంగీకరించబోమని” స్పష్టం చేశారు. మూడు భాషా విధానంతో కూడిన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని అమలు చేయకపోతే.. రాష్ట్రాలకు నిధులు నిలుపుదల చేస్తామంటూ.. కేంద్రమంత్రి కిందటి నెలలో చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రధాని సమాధానం చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. “ఇదేమైనా బ్లాక్‌మెయిలింగా...?”  అని ప్రశ్నించారు


పార్లమెంట్‌లో కనిమొళి నిరసన


మంత్రి వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో కూడా నిరసన వ్యక్తమైంది. డీఎంకే ఎంపీ కనిమొళి మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తమ రాష్ట్రాన్ని అవమానించారని నిరసన తెలిపారు. డిఎంకే సభ్యుల నిరసనలతో లోక్‌సభ ౩౦నిమిషాలు వాయిదా పడింది. ఆ తర్వాత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్... తన సమాధానంలో ఇబ్బందికరమైన అంశాలుంటే ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. దీంతో వాటిని పార్లమెంట్ రికార్డ్స్ నుంచి తొలగిస్తామని స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా తెలిపారు.


తమిళ్‌లో హిందీమంటలు


Tamil Nadu Vs Center  లాంగ్వేజ్ వార్ కొన్నాళ్లుగా నడుస్తోంది. డీఎంకే, ఎన్నికల కోసం  దీనిని ఓ అస్త్రంగా మలుచుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది. స్టాలిన్ వైఖరిని మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళసై తప్పు పట్టారు. హిందీ చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కొన్నాళ్ల క్రితం తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా కూడా స్టాలిన్ పై చురకలు వేశారు. తమిళ ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే ఎక్కువ చేస్తోందన్నారు. కేంద్ర పారామిలటరీ పోలీసు పరీక్షలను తమిళ్ లో నిర్వహించాలన్న స్టాలిన్ డిమాండ్‌పై స్పందిస్తూ.. ముందు రాష్ట్రంలోని ఇంజనీరంగ్, మెడికల్ సిలబస్‌ను మాతృభాషలోకి మార్చండని చురకలు వేశారు.


“స్టాలిన్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు.  చరిత్ర స్పష్టంగా చెబుతోంది. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన వారు ఓడిపోయారు లేదా మాతో కలిసిపోయారు” అంటూ 1960లలో కాంగ్రెస్ హయాంలోని యాంటీ హిందీ మూమెంట్ ను గుర్తు చేశారు.