విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్! వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారని సమాచారం. మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే దాదాపు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడానని నితీష్ చెబుతున్నారు. ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలో చాలా పార్టీలు ఏకతాటిపైకి వస్తాయని శుక్రవారం అంబేద్కర్ం జయంతి సందర్భంగా తన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
సమావేశాలన్నీ సానుకూలంగా, నిర్మాణాత్మకంగా
విపక్షాల మధ్య ఐక్యత కోసమే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలతో తాను సమావేశమైనట్లు నితీశ్ కుమార్ తెలిపారు. తాను పాల్గొన్న సమావేశాలన్నీ సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఇతర పార్టీల నేతలతోనూ మాట్లాడతానని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో కూలంకషంగా చర్చించానని, ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా అంగీకరించారని నితీష్ చెప్పుకొచ్చారు. మూడు రోజుల పర్యటన కోసం న్యూఢిల్లీ వచ్చిన నితీష్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. అందరి మద్దతు కూడగట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి వచ్చే పనిలో ఉన్నామన్నారు నితీష్. దీనిలో భాగంగా నిన్న సీపీఐతో కూడా మాట్లాడారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై నిర్ణయించుకునేందుకు విపక్షాలన్నీ ఒకచోట కూర్చుని చర్చించుకోవాలన్నది తన కోరిక అని నితీష్ స్పష్టం చేశారు.
త్వరలో కేసీఆర్, మమతతో భేటీ
బుధవారం రోజే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో భేటీ కావడంతో విపక్షాల ఐక్యతా ప్రయత్నాలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌కు సమ దూరాన్ని పాటిస్తున్న పార్టీలతో చర్చించేందుకు నితీశ్ అంగీకరించినట్టు తెలుస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారని సమాచారం.
నితీష్ కుమార్ ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యతను ఏవిధంగా పటిష్టం చేయాలనే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మనీ లాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈడీ ఎదుట హాజరైన రోజే బీహార్ నేతలిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్ 2022 సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో పర్యటించారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, డి.రాజా, సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్ తోనూ చర్చలు జరిపారు. గత ఫిబ్రవరిలో విపక్ష ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా చెప్పారు.
అయితే, నితీష్ ఢిల్లీ పర్యటనపై బిహార్ బీజీపీ స్పందించింది. విపక్ష నేతల్లో ఐక్యత ఎండమావేనన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ లైట్ తీసుకున్నారు. ప్రధాని కావాలన్న ఆశలు తనకు లేవని నితీష్ కుమార్ అన్నారు. సమష్టిగా పోరాడితే బీజేపీని 100 సీట్లకు పరిమితం చేయవచ్చన్నారు.