Steel Plant Politics : స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేస్తామని చేసిన ప్రకటన నుంచి ప్రారంభమైన రాజకీయం .. శుక్రవారంమ కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామన్న బహిరంగ ప్రకటనతో ఇంటర్వెల్ కార్డు పడినట్లయింది. ఈ ఫస్టాఫ్ రాజకీయంలో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అంటే.. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలతో ఓ ఆట ఆడుకుందని అర్థం చేసుకోవచ్చు. నిర్మోహమాటంగా స్టీల్ ప్లాంట్ అమ్మి తీరుతాం అని ఆ పార్టీ చెబుతోంది. ఆ పార్టీకి వచ్చే.. పోయే లాభ నఎ్టాలు ఏమీ లేవు. ఎందుకంటే బీజేపీకి ఏపీపై ఎలాంటి ఆశలు లేవు. అదే సమయంలో ఏపీలో అడుగుపెడతామంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని హైలెట్ చేసుకుంటున్న బీఆర్ఎస్‌కు బీజేపీ ఆశ పెట్టి .. షాక్ ఇచ్చినట్లయింది.
క్రెడిట్ కోసం ఆరాటపడిన బీఆర్ఎస్‌కు షాక్ !
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే నేరుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతానికి అనే పదం ఉంది. కానీ దాన్ని ఏపీ రాజకీయ పార్టీలు చాలా తేలికగా తీసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ప్రచారం ప్రారంభించేశాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని కొత్తగా ఉద్యమంలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు ఇంత కంటే తమకు కావాల్సిన కిక్ ఏముంటుందని రంగంలోకి దిగిపోయారు. స్వయంగా కేటీఆర్... కేసీఆర్ దెబ్బకు దిగి వచ్చిన కేంద్రం అని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. తర్వాత హరీష్ రావు .. ఇతరులు కూడా అదే ప్రకటన చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా హోరెత్తించింది. నిజంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందేమో అనే అనుమానం చాలా మందికి వచ్చింది. అందుకే.. ఇతర పార్టీల నేతలూ.. తమ పోరాటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందనే ప్రచారాన్ని ప్రారంబించాయి. కానీ ఒక్క రోజులోనే కేంద్రం సీన్ రివల్స్ చేసింది.
క్రెడిట్ కోసం బీఆర్ఎస్‌తో పోటీ పడిన ఇతర పార్టీలు !
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకపోయినా.. ప్రస్తుతానికి ఆపేశారని అనుకున్న రాజకీయ పార్టీలు తమ పోరాటాల వల్లేనని చెప్పుకోవడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నేతలు తమ నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్ష చేశారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు కూడా ఏం తక్కువ చేయలేదు. జీవీఎల్ నరసింహారవు ఉన్న పళంగా ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆ క్రెడిట్ తమకే దక్కాలన్నట్లుగా వ్యవహరించారు. ఇక వైఎస్ఆర్‌సీపీ నేతలు.. ఇటీవల సీఎం జగన్ డిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఈ విషయంపై మాట్లాడారని అందుకే వెనక్కి తగ్గారని ప్రచారం చేసుకున్నారు. చివరికి పవన్ కల్యాణ్ కూడా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నట్లుగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పవన్ పోరాటం ఫలించిందని చెప్పుకున్నారు. ఇలా అందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా గట్టిగా ప్రయత్నించామని ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ చిన్నబోయేలా కేంద్రం చక్రం తిప్పేసింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజకీయం చేసిన కేంద్రం - బుట్టలో పడ్డ పార్టీలు !
బీఆర్ఎస్ పార్టీని ఏపీలో విస్తరించడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని ఓ అవకాశంగా చేసుకున్నారు. అందుకే మూలధన సమీకరణ కోసం జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో బిడ్ వేస్తామని ప్రకటించారు. సింగరేణి అధికారుల్ని పంపారు.కానీ బిడ్ వేసే అవకాశాలు లేవు. శనివారమే బిడ్ కు ఆఖరు తేదీ . ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బిడ్ వేయడం లేదని.. న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు సంకేతాలు పంపాయి. అదే సమయంలో కేంద్రం తాము ప్రైవేటీకరణ ఆపలేదని ప్రక్రియ సాగుతోందని ప్రకటించింది. క్రెడిట్ కోసం పోటీపడిన పార్టీలు బీఆర్ఎస్‌తో పాటు బోర్లా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ తాము పోరాటం చేస్తామంటున్నాయి.
భారతీయ జనతా పార్టీ చేసిన రాజకీయంతో ఆ పార్టీ స్ట్రాటజీ క్లియర్ గా నే ఉన్నట్లుగా ప్రజలకు స్పష్టమవుతోంది. కానీ ఇతర పార్టీలను మాత్రం ఓ మూడు రోజుల పాటు ఓ ఆట ఆడుకుంది .. ప్రజల ముందు వారిని నవ్వుల పాలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ ట్రాప్‌లో రాజకీయ పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా బీఆర్ఎస్.