KCR National Plan : 2024 ఎన్నికల్లో ఢిల్లీ గడ్డపై జెండా ఎగురవేస్తామని కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితి గుర్తింపును రెండు రోజుల కిందటే ఒక్క తెలంగాణకే పరిమితం చేసింది ఈసీ. ఇలాంటి సమయంలో తాము సంచలనం సృష్టించబోతున్నామన్న నమ్మకాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఆయన నమ్మకాన్ని కారణం ఏమిటి అనేది కూడా కేసీఆర్ తన మాటల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అదే రైతు బంధు, దళిత బంధు.  ఈ రెండు పథకాల ద్వారా దేశవ్యాప్తంగా విప్లవం సృష్టిస్తానని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. 


ఒక్కో ఇంటికి రూ. పది లక్షలు - దళితలు ఓటు బ్యాంక్‌కు ఇది చాలదా ?


దేశవ్యాప్తంగా దళితులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంఖ్యాపరంగా వారు కీలకం. తెలంగాణలో కూడా దాదాపుగా ఎనిమిది నుంచి పది శాతం ఉంటారని అంచనా.  దళితులు ఎటు వైపు ఉంటే వారికి విజయం సులభం. అందుకే కేసీఆర్ ఇటీవలి కాలంలో వ్యూహాత్మకంగా దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దళిత బంధు వంటి పథకాన్నితెచ్చారు. ఈ పథకంలో భాగంగా రూ. పది లక్షలు ఉపాధి కోసం ఇస్తారు. అది అప్పు కాదు. పూర్తిగా ఉచితం. పేద దళితులకు ఈ డబ్బుతో జీవితం స్థిరపడిపోతుంది. మంచి వ్యాపార యూనిట్లు పెట్టిస్తున్నారు. ఆ సక్సెస్ స్టోరీలు తెలంగాణలో ఉన్నాయి. అందుకే ఇదిదేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రతి దళిత ఇంటికి రూ. పది లక్షలు వస్తాయన్న ప్రచారం ఉద్దృతంగా  సాగితే.. బీఆర్ఎస్‌కు అంత కంటే కావాల్సిందేముంది ?


రైతు బంధు  మరో విప్లవాత్మక పథకంగా కేసీఆర్ భావన  !
  
"రైతుబంధు" పథకాన్ని కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని కేసీఆర్ చెబుతున్నారు.  కేసీఆర్ కొన్ని రోజులుగా దేశ్‌కి నేతగా... ప్రచారంలోకి వస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎజెండాలో రైతు మొదట ఉంటారు.  కాంగ్రెస్, బీజేపీలు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి... సమృద్ధిగా ఉన్న నీళ్లను కూడా.. పొలాలకు అందివ్వలేకపోయాయన్నది కేసీఆర్ ఆ రెండు జాతీయ పార్టీలపై మోపుతున్న అభియోగం. రైతులందరికీ.. నీటి సౌకర్యం కల్పిండమే అజెండా అని... దానికి సంబంధించిన లెక్కలనూ చెబుతున్నారు. దీన్ని అన్ని రాష్ట్రాల్లోని రైతులు నమ్మాలంటే.. ముందుగా రైతులకు తానేం చేశానో చూపించాలనుకున్నారు. అందుకే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఏడాదికి ఎకరానికి పది వేలు అంటే తక్కువ మొత్తం కాదు. ఐదు ఎకరాలు ఉన్న రైతుకు యాభై ేలు వస్తాయి. కేసీఆర్ ఈ పథకానికి వ్యూహాత్మకంగా మొదటి నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నారు.  స్థానిక పథకాల్ని కూడా దేశవ్యాప్తంగా మార్కెట్ చేసుకోవడంలో కేసీఆర్‌ను మించిన పొలిటికల్ లీడర్ లేరన్న అభిప్రాయం ఇప్పటికే రాజకీయవర్గాల్లో బలంగాఉంది. 


రైతులు, దళితుల ఓటు బ్యాంక్ ఆకట్టుకుంటే గెలుపు ఖాయం ?


ఇప్పటికే కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితికి రైతు ఇమేజ్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతు  బంధు.. వారికి తోడు దళిత బంధు పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని హామీ ఇస్తే... ఆ వర్గాలు బీఆర్ఎస్‌కు దగ్గర అవుతాయని  అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే కేసీఆర్‌లో ధీమా కనిపిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలో అద్భుతమైన ఆదరణ ఉందని.. అక్కడ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఓ నమ్మకాన్ని కేసీఆర్ బలంగా వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తర్వాత ఉత్తరాదిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.