AP Elections: ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ వైసీపీ(YSRCP), ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP)లకు చాలా ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. `వైనాట్ 175` నినాదంతో వైసీపీ, వైనాట్ పులివెందుల? నినాదంతో టీడీపీ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గాలకు ఎంపిక చేస్తున్న అభ్యర్థుల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా(Nellore District)కు సంబంధించిన కీలకమైన నియోజకవర్గం నెల్లూరు సిటీ. ఈ టికెట్‌ను మాజీ మంత్రి, కాపు నాయకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూ రు నారాయణకు ఇస్తున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
టికెట్‌పై గ్రీన్ సిగ్నల్
వాస్తవానికి ఇప్పటికే ఆయన నెల్లూరు(Nellore city) నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా రెండు రోజుల కిందట జరిగిన చర్చల్లో చంద్రబాబు(Chandrababu)... మాజీ మంత్రి నారాయణ(Ex minister Narayana)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని.. గెలిచిన తర్వాతే రావాలని ఆయన దిశానిర్దేశం చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలన్న సంకల్పంతో నారాయణ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికలకు ముందే పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. నారాయణ సతీమణి రమాదేవి ఇప్పటికే రంగంలోకి దిగారు.
గత ఎన్నికల్లో ఓటమి
గత 2019 ఎన్నికల్లో నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఈ సారి కూడా ఆయనకు ఇదే స్థానాన్ని ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరంలో చేసిన అభివృద్ధి ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు. దీనికి తోడు.. నియోజకవర్గంపై పట్టు ఉండడం.. గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి కూడా తోడవడంతో నారాయణ గెలుపు ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.
అనిల్ మార్పుతో..
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తొలిసారి పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ(అప్పట్లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు).. స్వల్ప తేడాతో ఓడిపోయారు. వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్(Poliboina Anilkumar yadav) వరుసగా విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ దఫా మాత్రం అనిల్‌ను ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ పంపించింది. దీంతో నారాయణపై ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన ఓటమి నుంచి గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని.. ఎవరు పోటీ పడినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కాలని నారాయణ భావిస్తున్నారు.
మిత్రపక్షం కలిసి రానుందా!
2019 ఎన్నికల్లో పొంగూరు నారాయణకు 71 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి ఇక, ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌కు 74 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అంటే.. ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 3 వేలు మాత్రమే. అది కూడా.. ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగింది. అప్పట్లో జనసేన తరపున కేతంరెడ్డి వినోద్(Kethamreddy Vinod) పోటీ చేశారు. ఈయనకు 8 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇక, ఇప్పుడు జనసేన-టీడీపీ మిత్రపక్షంగా ఉండడంతో ఓట్లు చీలే అవకాశం లేదు.
ఇంటింటి ప్రచారం..
మరోవైపు.. తనకు ప్రతికూలంగా ఉన్న మండలాలపై నారాయణ దృష్టి పెట్టారు. ఈ మండలాల్లో టీడీపీ సానుభూతిపరులు, కేడర్‌తో ఆయన టచ్‌లో ఉన్నారు. పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం వివరిస్తు న్నారు. ఇక, ఆయన సతీమణి(Wife).. రమాదేవి(Ramadevi).. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే.. ఇంటింటి ప్రచారంచేస్తున్నారు. మహిళలకు బొట్టు పెట్టి మరీ.. తన భర్తను గెలిపించాలని కోరుతున్నారు. ఇది వర్కవుట్ అవుతుందని పార్టీ అంచనా వేస్తోంది. వీటికితోడు పొత్తు కూడా కలిసి వచ్చి.. ఈ నియోజకవర్గంలో నారాయణ గెలుపు తథ్యమని భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. నారాయణను ఓడించి తీరుతామని అంతర్గత సంభాషణల్లో చెబుతున్న వైసీపీ పెద్దలు ఎలాంటి నేతను నిలబెడతాయో చూడాలి. ఈ క్రమంలో నారాయణ మంత్రం ఏమేరకు ఫలిస్తుందో తేలాలంటే.. ఎన్నికల వరకు వెయిట్ చేయాలి.