Water politics between Congress BRS: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతూండంతో తెలంగాణ రాజకీయ పార్టీలు మరోసారి కార్యకలాపాల్ని వేగం పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వేగంగా  కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించడానికి బీఆర్ఎస్  కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని అందుకుంది. కాంగ్రెస్ పోటీగా చలో మేడిగడ్డ కు పిలుపునిచ్చింది. 


13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్ని మేడిగడ్డుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం 


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12తో ముగియనున్నాయి. 12న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల, చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ అప్రప్రియేషన్ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.          


11వ తేదీన సీఎల్పీ సమావేశం 


అంతకంటే ముందు 11వ తేదీన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇరిగేషన్ చర్చపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. 13వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.  ఈనెల 13వ తేదీన ఉదయం 10.30 గంటలకు 119 ఎమ్మెల్యేలు, 40మంది శాసన మండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం తీసుకెళ్తుందని అసెంబ్లీలో రేవంత్ ప్రకటించారు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా 12న అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనాలని, 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాక.. ప్రతిపక్ష నేతను ప్రత్యేకంగా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అనుకున్నారు. అయితే మేడిగడ్డ సందర్శనకు ఉత్తమ్ ఆహ్వానిస్తారని  తెలియడంతో ఆయన ఆగిపోయారని అంటున్నారు                 


13న నల్లగొండలో బీఆర్ఎస్ సభ                       
 
13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్ పల్లి -అద్దంకి హైవేకి ఆనుకునిఉన్న విశాలమైన స్థలంలో సభను నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ తలపెట్టిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తేదీని ఖరారు చేసింది. దీంతో తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల  అంశంపై రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరినట్లయింది.