2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వరసగా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల ఎంపీలతో సమావేశం అవుతున్నారు. 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. రామమందిరం మినహా.. ఇతర సమస్యలపై ఎంపీలు దృష్టి సారించాలని సూచించారు. తరచూ ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకం అవ్వాలని, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  


2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఎన్డీఏలోని 430 మంది ఎంపీలను బీజేపీ 11 గ్రూపులుగా విభజించింది. వారితో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ఉత్తర ప్రదేశ్, బ్రజ్, కాన్పూర్, బుందేల్ ఖండ్  ప్రాంతాలకు చెందిన ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. 


ప్రజల మనసును గెలిచిన వారే ఎన్నికల్లో గెలుస్తారని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలపై మాట్లాడాలని, వివాహాలు, ఫంక్షలు ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు వెళ్లాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. 2024 విన్నింగ్ మంత్రను ఎంపీలకు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో కోపం ఎక్కువగా ఉంటుందని, వారితో మాట్లాడాలని, పరిస్థితులను వివరించాలని, కోపంతో ఉన్న వారితో ఎక్కువ సమయం మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు.  


ఎంపీలతో సమావేశంలో యూపీఏపై విమర్శలు గుప్పించారు ప్రధాని. యూపీఏ స్వార్థం గురించి ఆలోచిస్తే,, ఎన్డీఏ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందన్నారు. యూపీఏ మాదిరి కాకుండా ఎన్డీఏ త్యాగాలకు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇందుకు బిహార్ పొలిటికల్ చిత్రాన్ని ఉదహరించారు. బీజేపీ కంటే నితిష్ కుమార్‌కు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నా ఆయన్ను ముఖ్యమంత్రిని చేశామని అన్నారు. అయితే నితీష్ కుమార్ సంకీర్ణాన్ని కాదని ప్రతిపక్షాలతో చేరారని అన్నారు. అలాగే పంజాబ్ పరిస్థితిని సైతం ఉదహరించారు. పంజాబ్‌లోని అకాలీదళ్‌తో ప్రభుత్వంలో ఎన్డీఏకు మంచి సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఉపముఖ్యమంత్రి పదవిని అడగలేదని చెప్పారు. 


రేపు దక్షిణాది ఎంపీలతో మోదీ సమావేశం
వరుస సమావేశాల్లో భాగంగా బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌ల నుంచి 96 మంది ఎంపీలతో ప్రధాని భేటీ అవుతారు. ఎన్డీఏ లక్ష్యాలు, ఎన్నికల వ్యూహాలు వివరిస్తారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశాల్లో భాగం కానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలను 11 గ్రూపులుగా విడదీసి విడి విడిగా సమావేశం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారమే ఎజెండగా ఎన్డీఏ మిత్ర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారిని సమన్వయం చేసుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు.