KCR National Politics :  తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం జరిగిందన్న ఆడియోలు వెలుగులోకి రావడం.. ఫామ్ హౌస్ కేసుగా ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అమిత్ షా, బీఎల్ సంతోష్ లాంటిపెద్ద నేతల పేర్లు ఉన్నాయని.. జాతీయంగా ఈ అంశం సంచలనం సృష్టిస్తుందని అనుకున్నారు. కేసీఆర్‌కు సంఘిభావంగా జాతీయ నేతలు నిలుస్తారని భావించారు. కానీ తెలంగాణలో తప్ప.. బయట ఈ కేసు పెద్దగా ప్రచారాంశం కాలేదు. బీజేపీ జాతీయ నేతలు పట్టించుకోలేదు. అంతే కాదు.. బీజేపీ బాధిత  పార్టీలు కూడా స్పందించలేదు. దీంతో కేసీఆర్‌కు ఈ ఎపిసోడ్‌లో అనుకున్నంతగా మద్దతు లభించలేదన్న వాదన వినిపిస్తోంది. 


ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుపై కేసీఆర్ వ్యూహం ఏమిటి ?


ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుపై కేసీఆర్ ఇంత వరకూ నోరు విప్పలేదు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా  బయట కనిపించడం లేదు. నాలుగు రోజుల నుంచి వారు ప్రగతిభవన్‌లోనే ఉన్నారని చెబుతున్నారు. అటు కేసీఆర్ బయటకు రాక.. ఇటు ఎమ్మెల్యేలూ బయటకు కనిపించకపోవడంతో ... ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలను గురి పెట్టారు. ఏం  చేసినా... జాతీయ స్థాయిలో హైలెట్ చేద్దామనుకుంటున్నారు. అందుకే.. సరైన సమయం కోసం వేచి చూద్దామనుకుంటున్నారని చెబుతున్నారు. ఏదైనా తను మాట్లాడితే జాతీయ అంశం కావాలనుకుంటున్నారు. అందుకే వెయిట్ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. 


కేసీఆర్‌కు సంఘిభావం చెప్పని జాతీయ నేతలు !


అయితే  ఈ ఎపిసోడ్‌లో .. బేరాలను నేరుగా ఆడియోలతో సహా వెలుగులోకి తెచ్చినప్పటికీ ఇతరుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు కూడా పెద్దగా మాట్లాడటం లేదు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని ఆడియో టేపుల్లో ఉన్నా కేజ్రీవాల్ స్పందించలేదు. మనీష్ సిసోడియా మాత్రం ముక్తసరిగా స్పందించారు. ఇక బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తామని ప్రకటించిన కుమారస్వామి స్పందించారు. అంతే కానీ.. మరొక్క జాతీయ, ప్రాంతీయ పార్టీ నేత  కూడా కేసీఆర్‌కు సంఘిభావం చెప్పలేదు. పలువురు ఫోన్లు చేశారని మీడియాలో ప్రచారం జరిగింది కానీ.. అలాంటిదేమీ లేదని ఆయా రాష్ట్రాల నుంచి  వస్తున్న ఫీడ్ బ్యాక్ చెబుతోంది. బీజేపీ ఆకర్ష్‌కు బలైపోయిన శివసేన  లాంటి పార్టీలు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇక స్టాలిన్, మమతా బెనర్జీ , నవీన్ పట్నాయక్, పినరయి విజయన్ .. అఖిలేష్ యాదవ్.. ఇలా ఎవరూ స్పందించలేదు. దీంతో ఈ అంశంలో కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో మద్దతు దొరకలేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. 


టీఆర్ఎస్‌లో చేరికలే మైనస్ అవుతున్నాయా ?


టీఆర్ఎస్ పార్టీ ఏమైనా విలువలతో కూడిన రాజకీయాలు చేసిందా అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఎందుకంటే ఆ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ.. రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకున్నారు. అందుకే ఈ అంశంలో టీఆర్ఎస్‌ చురుగ్గా జాతీయ స్థాయిలో హైలెట్ చేయలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. ఇతర పార్టీల నేతలు కూడా ..తాము సమర్థిస్తే.. ఇదే అంటారన్న భావనతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే అనుకున్నంతగా మద్దతు రాలేదంటున్నారు. 


కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒంటరేనా ?


ప్రస్తుతం తెలంగాణలో బయటపడిన ఈ ఫామ్ హౌస్ స్కాం  చాలా పెద్దదని అనుకోవచ్చు. బీజేపీ బాధితులందరూ ఏకమయ్యేందుకు మంచి అవకాశం. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోనూ ఒంటరిగానే... మహా అయితే జేడీఎస్ లాంటి పార్టీతో వెళ్లి తప్ప.. ఉత్తరాదిలో ఆయనతో కలసి వచ్చేపార్టీలేవీ ఉండవని అనుకోవడానికి సంకేతాలని అనుకోవచ్చంటున్నారు.