Nara Lokesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్, మమతా బెనర్జీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేష్ ఒంటరి వారు అయ్యారా. ఈ ప్రశ్నే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్ క్వశ్చన్. ఇదే ప్రశ్న ను నారా లోకేష్ ప్రెస్ మీట్ లో ఏబీపీ దేశం లోకేశ్ ను అడిగింది. దానికి స్పందించిన లోకేష్ పవన్ కళ్యాణ్ తనకు అన్నలాంటి వారు అని చెప్పారు. ఆయన ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే తను ఒంటరి వాడిని ఎందుకవుతానంటూ సమాధానమిచ్చారు సోమవారం ఆయన రాజమండ్రి జైలు సమీపంలోని విద్యానగర్‌ విడిది కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. 


తాను పవన్ కల్యాణ్‌ను అన్నగా భావిస్తానని.. పవన్, మమతా బెనర్జీ, ప్రజలు ఈ కష్ట సమయంలో తమకు స్వచ్ఛందంగా అండగా నిలబడ్డారని, వారందరూ ఉండగా తానెలా ఒంటరి వాడిని అవుతానని అన్నారు. అలాగే టీడీపీ తలపెట్టిన బంద్ కు సహకరించిన ప్రజలు, పవన్‌, మంద కృష్ణ మాదిగ, కమ్యూనిష్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 



‘జగన్‌కు ఒళ్లంతా విషమే’
లోకేష్ మాట్లాడుతూ.. ‘జగన్ చేసిన అతి పెద్ద తప్పు చంద్రబాబు అరెస్ట్. పాముకు తలలో విషం ఉంటే జగన్‌కు ఒళ్లంతా విషమే ఉంటుంది. జగన్‌కు అధికారం అంటే ఏమిటో తెలియదు. అధికారం అంటే ప్రజలకు మేలు చేయడం. ఉద్యోగాలు కల్పించడం, అభివృద్ధి చేయడం. కానీ జగన్ దృష్టిలో అధికారం అంటే వేధింపులు, కక్ష తీర్చుకోవడం మాత్రమే. జగన్ రెడ్డిపై 38 కేసులు ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు, పింక్ డైమండ్ కేసు, కోడి కత్తి కేసుల్లో ఎంత నిజముందో, చంద్రబాబుపై పెట్టిన కేసులో కూడా అంతే నిజముంది. ఈ కేసుతో జగన్ ఎంత సైకోనో ప్రజలకు తెలిసొచ్చింది’ అని అన్నారు.


‘యువగళం ఆపేస్తున్నా’
ప్రస్తుతం జరుగుతున్న యువగళం పాదయాత్రను ఆపేస్తున్నా. మా నాయకుడు చంద్రబాబుపై దాడి జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యతనాపై ఉంది. నాయకులు అందరితో సమాలోచనలు జరిపి తిరిగి ఎప్పుడు ప్రారంభించేది చెబుతాం. సైకో బూతు పదం కాదు, హాలిడే సీఎం బూతు కాదు, ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూతు పదం కాదు. సజ్జల పేరు బూతు అయితే ఆయన పేరు మార్చుకోవాలి. నేను ఆ మాటలు అన్నందుకే చంద్రబాబును జైలుకు పంపారా? గతంలో చంద్రబాబు కాలర్ పట్టుకోవాలని, కాల్చి చంపాలని, చీపురు తీసుకొని కొట్టమని వైసీపీ నేతలు అన్నారు. చంద్రబాబుపై అవినీతి ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నారు. వైసీపీ నిండా అవినీతి పరులే.  ఆ ముద్రను చెరిపేసేందుకు ఇతర పార్టీలపై బురద చల్లుతున్నారు’ అని ధ్వజమెత్తారు.


‘జగన్‌ను వదిలిపెట్టను’
‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు ఆమోదం తెలిపిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో జగన్ చెప్పాలి. ఇన్నాళ్లూ ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు అంటే ఒకటే అర్థం. ఈ అంశంలో తప్పు జరగలేదు. ప్రభుత్వాన్ని ఒక్కటే ప్రశ్నిస్తున్నా..  స్కిల్ డెవెలప్మెంట్ ద్వారా చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని ఆధారాలతో నిరూపించే దమ్ము ఉందా? CID అనేది కక్ష సాధింపు డిపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. స్థానిక నేత ఆదిరెడ్డి అప్పారావు, సీనియర్ నాయకుడు చిన రాజప్పలపై కేసులు పెట్టారు. నాపై 20కి పైగా కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. నేను భయపడను. జగన్‌ను వదిలిపెట్టను. సొంత బాబాయ్‌ను చంపిన అవినాష్ రెడ్డి బయట దర్జాగా తిరుగుతున్నాడు’ అని విమర్శించారు.


‘బీజేపీ మిత్రులే సమాధానం చెప్పాలి’
‘ చంద్రబాబు అరెస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు పిక్చర్ ముందు ఉందని, లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. నేను రాజమండ్రిలోనే ఉన్నాను. ఏం చేస్తారో చేసుకోండి నేను సిద్ధంగానే ఉన్నాను. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న బొత్స వల్లే వోక్స్ వ్యాగన్ సంస్థ ఏపీకి రాష్ట్రానికి దక్కకుండా పోయింది. ముందు ఆయన దానికి జవాబు చెప్పాలి. మంత్రులు రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించాలి. చంద్రబాబుపై, నాపై ఉన్న శ్రద్ద వారికి ప్రజలపై లేదు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్క తేలుస్తాం. ఈ కేసు వెనక ఎవరున్నారో నాకు తెలియదు. కేంద్రానికి తెలియ కుండానే ఈ అరెస్ట్ జరిగిందో ఏమో నాకు తెలియదు. బీజేపీ మిత్రులే దీనికి సమాధానం చెప్పాలి’ అని లోకేష్ అన్నారు.