వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిష్ పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే కేసు విచారణ వాయిదా వేయాలంటూ పిటిషనర్ నర్రెడ్డి సునీత తరపు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. దీంతో ఈ కేసు విచారణ మూడు వారాలు వాయిదా పడింది. మూడు వారాల తర్వాత నాన్ మిస్లీనియర్ డే రోజున ఈ కేసు విచారణ చేపట్టే అవకాశముంది. 


కారణం ఏంటి..?
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో వాదనలు వినిపిస్తున్న సిద్దార్థ్ లూథ్రా, సునీత తరపున సుప్రీంకోర్టులో లాయర్ గా ఉన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో సునీత వేసిన పిటిషన్ లో కూడా లూథ్రా వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ఆయన ప్రస్తుతం చంద్రబాబు కేసుతో బిజీగా ఉన్నారు. దీంతో తన లాయర్ అందుబాటులో లేరని, అందుకే కేసు వాయిదా వేయాలంటూ సునీత కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. 


వైఎస్ వివేకా హత్య కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి A8గా ఉన్నారు. సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో గతంలోనే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు అవినాష్ రెడ్డి. తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. అప్పట్లో అవినాష్ రెడ్డితోపాటు సీబీఐకి కూడా సుప్రీం నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సీబీఐ సమాధానం చెప్పింది. అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా ఇటీవల సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. 


అవినాష్ రెడ్డి, ఈ కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని బెయిల్ రద్దుకోసం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ లో సునీత పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయడంతో మళ్లీ విచారణ మొదలైంది. ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే లాయర్ సిద్దార్థ్ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో సునీత ఈ విచారణను వాయిదా వేయాలని సుప్రీంని కోరింది. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉంటూ చంద్రబాబు కేసులను వాదిస్తున్నారు. సునీత తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని ధర్మాసనానికి తెలియజేశారు. ప్రధాన లాయర్ రాలేదని, ఆ కారణంతో విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. 


ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ కి మాత్రం కోర్టులనుంచి సానుకూల స్పందన రాలేదు. సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించడంతో మరోసారి తెలంగాణ హైకోర్టుని కూడా ఆశ్రయించారు భాస్కర్ రెడ్డి. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. అయితే అవినాష్ రెడ్డికి మాత్రం తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ సునీత న్యాయపోరాటం చేస్తున్నారు.