స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక పాత్రధారి అని భావిస్తున్న మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్ ఈ కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆస్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారని ప్రచారం జరిగింది. దీనిపై రమేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదంగా ఉదన్నారు రమేశ్‌. తాను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవమన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని సీఐడీని ప్రశ్నించారు. 


స్కిల్ డెవలప్‍మెంట్‌లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదన్నారు పీవీ రమేష్‌. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతోందన్నారు. తాను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందనే అనుమానం ఉందన్నారు. నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో ఎందుకు లేవని నిలదీశారు. 


స్కిల్ డెవలప్‍మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించార పీవీ రమేశ్‌. ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానమని అన్నారు. వారి పేర్లు ఏవని నిలదీశారు. 


‘‘సీఎంగా ఉండే వారు కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారు. ఆయా శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలి. సీఐడీకీ ఇచ్చిన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాను. ప్రతి బ్యాంకు అకౌంట్లో ఏం జరుగుతోందో సీఎంకి ఏం తెలుస్తుంది? ఆనాడు విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏం అయ్యాయి? స్కిల్ డెవలెప్‍మెంట్ కార్పొరేషన్ ఫైల్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. సీఎం అధికారుల మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు రిలీజ్ చేయించడం జరగదు. స్కిల్ డెవలెప్‍మెంట్ మీద రాసిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయి? తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి?   అధికారుల తప్పులను నాయకులకు ఎలా ఆపాదిస్తారు? చట్టపరమైన విధానాలు పాటించే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సీమెన్స్ గుజరాత్ ప్రభుత్వానికీ ఇదే తరహా సేవలు అందించింది’’ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తెలిపారు.