Nara Lokesh: విజయవాడ పలు కళాశాలల్లో విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేయాలనుకున్న విజయవాడ విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం అన్నారు. జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం, తరగతులు సస్పెండ్ చేయించి, కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ సర్కారు ఆదేశాలే కారణం అన్నారు. నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని గుర్తుంచుకోండి సైకో పాలకులారా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఢిల్లీలో లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించిందని ఆరోపించారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే ఢిల్లీ వచ్చినట్టు తెలిపారు. అనినీతి పరులు నీతిపరులను జైలుకు పంపుతున్నారని, ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అంశంలో అవినీతి నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారని, ఎలాంటి స్కామ్ జరగలేదని తాను నిరూపించగలనని.. అందుకు వైసీపీ నేతలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. స్కిల్ డెవెలప్మెంట్‌లో అన్ని పత్రాలు చూపించి అవినీతి జరగలేదని నిరూపిస్తానని, అపరిమిత అధికారం అపరిమిత అవినీతికి దారి తీస్తుందని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికే తాను ఢిల్లీ వెళ్లినట్లు లోకేష్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అన్యాయంగా చంద్రబాబును జైలుకు పంపిందని, ఆయనకు జరిగిన అన్యాయన్ని దేశ ప్రజలకు వివరిస్తామన్నారు. జాతీయ స్థాయి నేతలు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలిపారని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షతోనే బాబును అరెస్ట్ చేసిందని, రిమాండ్‌కు తరలించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సాక్షాలను తారుమారు చేసిందని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పనిచేయాలని నిర్ణయించారని అన్నారు.
సీఐడీ చీప్ ఇప్పటి కూడా స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని కానీ, కుటుంబం సభ్యుల ఖాతాల్లో డబ్బు జమైనట్లు కానీ నిరూపించలేకపోయారని అన్నారు. ఎందుకుంటే ఈ కేసులో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. న్యాయం జరగడం ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదన్నారు. చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని అన్నారు. అవినీతి రహిత నాయకుడికి చిరునామాగా నిలుస్తారని అన్నారు.
సుప్రీం కోర్టు న్యాయవాదులతో చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం జరుగుతున్న పరిణామాల వేళ నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన గురువారం ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోకేశ్ జతీయ మీడియాకు వివరించనున్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాక, చంద్రబాబుపై అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసి కూడా నారా లోకేశ్ చర్చించనున్నారు. అటు పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం వేసింది. అందుకోసం చంద్రబాబు అరెస్ట్ పై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేశ్ మాట్లాడనున్నారు.