Nandamuri Balakrishna  has not started campaigning yet In Hindupuram : హిందూపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓటమన్నది లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు.  బాలకృష్ణ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు మొదటి జాబితాలోనే ప్రకటించారు.  అభ్యర్థి ప్రకటన అయితే జరిగింది గానీ ఆయన పురం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇప్పటికీ ఆయన హిందూపురంలో అడుగు పెట్టలేదు. 


తీరిక లేకుండా ప్రచారాలు  చేస్తున్న ఇతర నేతలు        


ఉమ్మడి మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.  ఆయా అభ్యర్థులు  ఓ విడత ప్రచారం ముగించేశారు. హిందూపురంలో మాత్రం ఇప్పటికీ   ద్వితీయ శ్రేణి నాయకులతోనే ప్రచారం చేస్తోంది. ఇటీవల నారా లోకేష్‌ హిందూపురంలో శంఖారావం సభను ఏర్పాటు చేసి ఎన్నికలకు టిడిపి శ్రేణులను సన్నద్ధం చేసి వెళ్లారు. నారా లోకేష్‌ నిర్వహించిన కార్యక్రమంలో సైతం బాలకృష్ణ పాల్గొనలేదు.అది మినహా టిడిపి చెప్పకోదగ్గ పెద్ద కార్యక్రమం ఏదీ కూడా చేయలేదు. మామూలుగా అయితే ఆయన కుటుబసభ్యులైనా వచ్చినా  ఎన్నికల ప్రచార బాధ్యతలు చీసుకునేవారు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాలకష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నియోజకవర్గానికి రాకుండా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసే వారు లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం కన్పిస్తోంది.  


హిందూపురంలో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి పట్టుదల


హిందూపురం నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఆగ్ర నాయకత్వం మొత్తం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. వైసిపి రాయలసీమ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం వైసిపి గెలుపు బాధ్యతను తీసుకుని గత నాలుగు నెలల నుంచి వివిధ రూపాల్లో వైసిపి శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. పెద్దిరెడ్డి సారథ్యంలో హిందూపురం వైసిపి అభ్యర్థి దీపిక ప్రచారంలో ముందుకెళ్తోంది. గత మూడు నెలలుగా ప్రజల మధ్యనే ఉంటూ ఆమె ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అభ్యర్థి దీపిక, ఆమె భర్త వేణురెడ్డి ఇద్దరూ ప్రతి రోజు షెడ్యుల్‌ రూపోందించుకుని చెరొక ప్రాంతంలో పర్యటిస్తున్నారు.


రాజీనామా చేసి వైసీపీకి షాకిచ్చిన ఇక్బాల్


మరో వైపు హిందూపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి షాక్ కు గురి చేసింది. మైనార్టీకి టిక్కెట్ నిరాకరించడంతో ఆ వర్గాలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక్బాల్ టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బాలకృష్ణకు మరింత అడ్వాంటేజ్ అవుతుంది. అయితే బాలకృష్ణ ఎంత త్వరగా ప్రచారానికి వస్తే అంత మంచిదని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.