Paid Artist Sharmila : వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పెయిడ్ ఆర్టిస్టుగా అభివర్ణించారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కడప లోక్‌సభ బరిలోకి దిగిన షర్మిల తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని .. వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను చంపిన వ్యక్తి అని.. ఎవరి ఓటు వేయాలో ఆలోచించాలని ప్రజల్ని కోరుతున్నారు. హంతకుల ప్రభుత్వం ప్రభుత్వం పోవాలంటే సీఎం జగన్ ను ఓడించాలని పిలుపునిస్తున్నారు. ఈ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. షర్మిల ఇవ్వాల్సిన సంజాయిషీలు చాలా ఉన్నాయన్నారు.
వివేకా హత్యపై షర్మిల నాలుగేళ్లుగా ఎందుకు మాట్లాడలేదు
తెలంగాణ నుంచి హఠాత్తుగా షర్మిల ఎందుకు మాయం అయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఏపీ వచ్చి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారని.. వాటిని ఎవరిచ్చారన్నారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కొట్లాడుతానని తెలంగాణలో పార్టీ పెట్టారని.. . ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారని మండపడ్డారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని ఆమె.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారన్నారు. మరో నెలలో ప్రజా కోర్టులో ఇదంతా తేలుతుందన్నారు.
కూటమి ఉన్నా చంద్రబాబు చెప్పిన వాళ్లకే బీజేపీ, జనసేన టిక్కెట్లు
మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే కలిగిందని.. చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారన్నారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయన్నారు. అయినా 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోందన్నారు. 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈవో మీదకు దూకుడుగా వెళ్లారు. దబాయించి మాట్లాడారన్నారు.
వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల పించన్ పంపిణీ ఆలస్యం
చంద్రబాబు కక్షతో వలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసింది. తన ఏజెంట్ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా కుట్ర చేస్తోంది. వలంటీర్ వ్యవస్థ వల్ల రెండ్రోజుల్లో ఫించన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడది ఆలస్యం అయ్యింది. దీంతో పెన్షనర్షలోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది. దురదృష్టవశాత్తూ.. ఎండలకు తాళలేక కొందరు చనిపోయారు. అధికారులపైనా చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాక్షస మనస్తతత్వం ఏ నాయకుడిలో కనిపించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతీ వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తోంది. కోవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకం కూడా ఆపకుండా అందించారన్నారు.