కొన్నేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యమే సాగుతోందనే వెర్షన్ వినిపిస్తోంది. కానీ ఈ సారి మాత్రం బీసీలకు మూడు సీట్లు కేటాయించాలని, ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు ప్రతిపాదన పెట్టారు. ఇటీవల నల్గొండలో రేవంత్ హాజరైన నిరుద్యోగ సభలో బీసీలకు సీట్లు ఇవ్వాలని స్టేజ్ పైనే వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు మరింత దూకుడు పెంచారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్లు మినహాయిస్తే మిగిలినవి 9 అసెంబ్లీ స్థానాలు. ఇందులో కోదాడ, హుజూర్ నగర్ సెగ్మెంట్ లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ఉత్తమ్ హుజూర్ నగర్ పై కన్నేయగా, కోదాడ సీటును తన సతీమణి పద్మావతికి ఇప్పించాలని పట్టుపడుతున్నారాయన. నాగార్జున సాగర్, మిర్యాలగూడ సెగ్మెంట్ లపై ఆల్రెడీ కుందూరు జానారెడ్డి కర్చీఫ్ వేశారు. సాగర్లో ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జానారెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా, తనయుల్లో ఒకరికి మిర్యాలగూడ టికెట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కుదరని పక్షంలో మిర్యాలగూడ టికెట్ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ దక్కే అవకాశాలున్నాయి. అంతేగానీ వీరిద్దరినీ కాదని మరొకరికి టికెట్ వచ్చే ఛాన్స్ లేదనే చెప్పాలి.
నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాదని మరొకరికి టికెట్ దక్కడం ఇంపాజిబుల్. సూర్యాపేటలో ఆర్.దామోదర్ రెడ్డి మరియు పటేల్ రమేష్ రెడ్డి లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక భువనగిరి లో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాదని.. మరొకరికి టికెట్ కేటాయించే ఛాన్స్ లేదు. ఇక మిగిలిన ఆలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్టఫ్ ఉన్న లీడర్ లేకపోవడం తో బీసీ నేత బీర్ల ఐలయ్యకు టికెట్ దాదాపు ఖరారైనట్టే.
మునుగోడు నియోజకవర్గంలో మొన్నటి ఉప ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాల్వాయి స్రవంతి బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈసారి ఇదే సామాజిక వర్గానికి చెందిన చలమల్ల కృష్ణారెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు . ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ చలమల్లను ఎంకరేజ్ చేస్తుండగా....స్రవంతికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ప్రోత్సాహం ఉంది. బీసీ ఈక్వేషన్ లో పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ కూడా మునుగోడులో తొడ గొట్టెందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
అసెంబ్లీ స్థానాల్లో హైకమాండ్ హ్యాండిస్తే, పార్లమెంట్ స్థానాన్ని వదులుకోవద్దనే ప్లాన్ తో కూడా ఉన్నారట బీసీ నేతలు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు అసెంబ్లీ స్థానాలపై గురి పెట్టారు. ప్రస్తుతం ఈ స్థానాలకు వేకెన్సీ ఉంది. గెలుపు గుర్రాల వేటలో సామాజిక ఈక్వేషన్స్ ను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.