Nagababu No Elections : జనసేన పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ మాత్రమే పోటీ చేస్తారని ఇంకెవరూ పోటీ చేయరని స్పష్టం  చేశారు. తాను పూర్తిగా పార్టీ సేవకే అంకితమవుతానన్నారు. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తాను పోటీ చేయని విషయాన్ని ప్రకటించారు. 


సినిమాలకే చిరంజీవి పరిమితం 


పవన్ కల్యాణ్ పాదయాత్రతో సమానమైన యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. చిరంజీవి మద్దతు పూర్తి స్థాయిలో జనసేనకే ఉంటుంది కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేరని.. ఆయన పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారని నాగబాబు చెబుతున్నారు. ఈ విషయంలో చిరంజీవి మనసు మార్చుకునే అవకాశం కూడా లేదని చెబుతున్నారు. నాగబాబు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనసేన తరపున పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇటీవలి కాలంలో చొరవ తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆయన తరపున పార్టీ బాధ్యతలు తీసుకుని జిల్లాల్లోపర్యటిస్తున్నారు. 


నర్సాపురంలో పోటీ చేసి ఓడిన నాగబాబు


2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభా స్థానం నుంచి నాగబాబు పోటీ చేశారు. ఆ  ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్‌సీపీ తరపున నర్సాపురం నుంచి గెలిచారు.  అయితే నాగబాబు ఇరవై శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. పవన్ కల్యాణ్ చెప్పే ఆదర్శల ప్రకారం చూస్తే కుటుంబ సభ్యులను ప్రోత్సహించకూడదని.. కానీ నాగబాబుకు మాత్రం పిలిచి టిక్కెట్ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. అయితే పవన్ కల్యాణ్ అప్పట్లో పట్టించుకోలేదు. 


ఈ సారి మెగా ఫ్యామి్లీ నుంచి పవన్ మాత్రమే పోటీ 


వచ్చే ఎన్నికల్లో కూడా నాగబాబు పోటీకి రెడీ అవుతారని అనుకున్నారు. కానీ తాను పార్టీ సేవకే తప్ప ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో మెగా కుటుంబం నుంచి ఇంకెవరూ పోటీ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. జనసేన అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్.. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తప్పక  పోటీ చేయాల్సి ఉంటుంది.  చిరంజీవి నాయకత్వంలో ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీలోనూ నాగబాబు కీలక పాత్ర పోషించారు. అయితే అప్పట్లో కూడా  ఆయన పోటీ చేయలేదు. అల్లు అరవింద్ అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.