Pawan Kalyan Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయదశమి రోజున తిరుపతి నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 6నెలల్లో రాష్ట్రమంతా పర్యటన,ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని జనసైనికులు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.
నాదెండ్ల మనోహర్ ప్రకటనపై పవన్ సోదరుడు, జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు భిన్నంగా స్పందించారు. తిరుపతి నుంచి అక్టోబర్ 5న విప్లవం ప్రారంభమవుతుందన్నారు.
తిరుపతి నుంచి రాజకీయ కార్యకాలాపాలు ప్రారంభించడాన్ని ఓ సెంటిమెంట్‌గా భావిస్తూంటారు. గతంలో పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలోనే ప్రారంభించారు. స్వయంగా అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు కూడా. ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనుకుంటున్న పవన్ కల్యాణ్.. తన రాజకీయ యాత్రను తిరుపతి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయని ఏపీ రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. సీఎం జగన్ తన ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడానికి ఎనిమిది నెలల డెడ్ లైన్ పెట్టారు. అంటే ఆ తర్వాత ఎన్నికలు వస్తాయని నమ్ముతున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు యాత్రలు చేస్తున్నాయి. టీడీపీ కూడా జనంలోకి వెళ్తోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకూ అంగీకరించిన సినిమాల షూటింగ్స్ ను అక్టోబర్ వరకూ పూర్తి చేసి .. అప్పట్నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండాలని పవన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
గత ఎన్నికలకు ముందు కూడా పవన్ కల్యాణ్ యాత్ర చేశారు. అయితే మధ్య మధ్యలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ సారి పూర్తి స్థాయిలో నిరంతరాయంగా కొనసాగించాలని భావిస్తున్నారు.