BJP Plan : మునుగోడు ఉపఎన్ని షెడ్యూల్ ఎప్పుడైనా వస్తుందని అన్ని రాజకీయ పార్టీలు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుండి అనుకున్నాయి. కానీ ఇప్పుడే వస్తుందని మాత్రం ఊహించలేపోయారు. ఎందుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇతర అంశాలతో బిజీగా ఉన్నాయి. ఒక్క బీజేపీ మాత్రమే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోంది. అదను చూసి వ్యూహాత్మకంగా బీజేపీ ఇతర పార్టీలకు ఏ మాత్రం కలసి రాకుండా టైట్ షెడ్యూల్ రిలీజ్ చేసిందన్న అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి.
జాతీయ పార్టీ సన్నాహాల్లో టీఆర్ఎస్ !
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దసరా రోజున పార్టీ ప్రకటన చేయనున్నారు కేసీఆర్. ఆ తర్వాత తీరిక లేకుండా ఆ పార్టీ నిర్మాణంపైనే దృష్టి కేంద్రకీకరించాల్సి ఉంది. ఈ సమయంలో మునుగోడు ఉపఎన్నికలకు సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. కానీ మునుగోడు ఉప ఎన్నిక మాత్రం అత్యంత కీలకం. ఇప్పటికే అభ్యర్థిని కూడా ఖరారు చేసిన కేసీఆర్..అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అభ్యర్థిపై పార్టీలో వ్యతిరేకతను తగ్గించే కసరత్తు చేస్తున్నారు. ఎలా చూసినా ఉపఎన్నిక వస్తుందని తెలిసినా టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని అనుకోవచ్చు.
భారత్ జోడో యాత్రపైనే కాంగ్రెస్ దృష్టి !
ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ఇప్పటికే రూట్ మ్యాప్‌తో పాటు యాత్రను ఎలా సక్సెస్ చేయాలన్న అంశంపై దృష్టి సారించారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేశారు. ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాహుల్ జోడో యాత్ర కారణంగా సీనియర్లు మునుగోడుపై దృష్టి పెట్టే అవకాశం ఉండదు. ఇది ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రాహుల్ యాత్రం తెలంగాణలో జరుగుతున్నందున ఆ ఎఫెక్ట్ ను మునుగోడులో ఉండేలా చూసుకోవాలని కాంగ్రెస్ అనుకోవచ్చు. కానీ అదంతా తేలిక కాదు.
సన్నద్ధంగా బీజేపీ !
ఇక బీజేపీ మాత్రం పూర్తి స్తాయిలో సన్నద్ధంగా ఉందని అనుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మునుగోడు ఉపఎన్నికలో గెలుపును బీజేపీ హైకమాండ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రులు.. జాతీయ నాయకులు, అమిత్ షా కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఉపఎన్నిక కీలకం !
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక కీలకం కానుంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితమే.. తెలంగాణ రాజకీయ పరిణామాల్ని మార్చనున్నాయి. బీజేపీ గెలిస్తే ఆ పార్టీలో చేరికలు ఊపందుకుంటాయి. మూడో స్థానానికి పరిమితం అయితే.. కాంగ్రెస్ .. టీఆర్ఎస్‌కు ప్రత్యర్థిగా మారుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీనే హాట్ ఫేవరేట్ అవుతుంది. మొత్తంగా నెల రోజుల పాటు మునుగోడు యుద్ధం హోరెత్తనుంది.