Ysrcp Leaders Meet Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. మంచి సమయం చూసి పార్టీలో చేరతానని.. త్వరలోనే తేదీని ప్రకటిస్తానని ముద్రగడ తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలతో ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇంఛార్జీ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇంఛార్జీ తోట నరసింహం.. గురువారం ముద్రగడ నివాసంలోనే భేటీ అయ్యి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నుంచి పవన్ కు పోటీగా ముద్రగడను బరిలో దించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారుడికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కాగా, కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఆయన ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదని.. స్వతహాగా ఆయనే పార్టీలో చేరుతారని చెప్పారు. సీఎం జగన్ కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసని పేర్కొన్నారు.


కాగా, ముద్రగడ పద్మనాభం ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన భారీ విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమవేశంలో వైసీపీలో చేరుతాననే ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ప్రకటించలేదు. తర్వాత వైసీపీలో చేరేది లేదని.. జనసేనలో చేరుతానని ప్రకటించారు. అనంతరం జనసేన నేతలు ఆయనతో భేటీ అయ్యారు. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముద్రగడ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది. అయితే, పవన్ ఇటీవల రాజమండ్రిలో పర్యటించినా ముద్రగడ నివాసానికి వెళ్లలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తి చేశారు. 'మనం చెప్పాల్సింది చెప్పాం. తర్వాత మనం చేసేది ఏమీ లేదు. వస్తే ఓ నమస్కారం. రాకపోతే రెండు నమస్కారాలు.' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందన్న ప్రకటన వెలువడగానే.. ఈ అంశంపై ముద్రగడ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందన్నారు. 


ఆ తర్వాత టీడీపీ - జనసేన నిర్వహించిన సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పార్టీ మద్దతుదారులు నాకు సలహాలు ఇవ్వద్దు.. నాపై నమ్మకం ఉంటే నాతో కలిసిరండి' అంటూ స్పష్టం చేశారు. దీంతో ముద్రగడ జనసేనకు దూరమైనట్లు.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు ముద్రగడతో గురువారం భేటీ అయ్యి చర్చించారు. వారి ఆహ్వానం మేరకు.. వైసీపీలో చేరుతానని ముద్రగడ స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం సీనియర్ నేత. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. తునిలో ఆయన నిర్వహించిన సభ ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే తర్వాత రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదిలేశారు. వైసీపీకి దగ్గరై.. అనంతర పరిణామాల నేపథ్యంలో జనసేనకు దగ్గరయ్యారు. ఇప్పుడు మళ్లీ వైసీపీలో చేరుతున్నారు.


Also Read: CM Jagan: 'అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసమే చేయూత' - చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు