Andhra Pradesh Politics : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections )గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ (TDP)వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ (YSRCP)ని మట్టి కరిపించడంతో కాదు...ఆ పార్టీలో కీలక నేతల ఓటమికి ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీని అనేక ఇబ్బందులకు గురి చేసిన వారు... మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న ధ్యేయంతో పని చేస్తోంది. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు...ప్రత్యేక టీంలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొంత మందిని టార్గెట్‌ చేసుకుని మరీ ఎన్నికలకు సిద్దమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఇబ్బందుల్లోకి నెట్టిన వైసీపీ బిగ్‌ షాట్స్‌ను టార్గెట్‌ చేసుకున్నట్లు సమాచారం. వైసీపీలో కొందరు నేతలు అదే పనిగా టీడీపీని విమర్శించారు. మాటలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమే కాదు... విపరీతమైన డామేజ్‌ చేశారు. అందుకే అధికార పార్టీలోని కొందరి బిగ్‌ షాట్స్‌ను టార్గెట్‌ చేసుకుని ఎన్నికలకు వెళ్లేలా టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 


ముఖ్యంగా టీడీపీ టార్గెట్‌లో ఉన్న వారి జాబితాలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్‌, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, వల్లభనేని వంశీ,  దేవినేని అవినాష్‌  వంటి వారి విషయంలో టీడీపీ సీరియస్‌గా ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. వీరంతా టీడీపీ, చంద్రబాబును విపరీతంగా డామేజ్‌ చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. టీడీపీని, చంద్రబాబును నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... కుప్పంలో టీడీపీని టార్గెట్‌ చేసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటమే కాకుండా టీడీపీ కేడర్ ను అనేక ఇబ్బందులకు గురి చేశారనే విమర్శ ఉంది. పైగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పదే పదే కామెంట్లు చేస్తూ...టీడీపీ కేడర్‌ను ఇరిటేట్‌ చేస్తున్నారు పెద్దిరెడ్డి. దీంతో పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు సెగ్మెంటుపై టీడీపీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. పెద్దిరెడ్డి ఎన్నికల సమయంలో పుంగనూరు దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించాలని టీడీపీ నిర్ణయించిందట. దీంతో పుంగనూరులో ప్రత్యేక టీంలను రంగంలోకి దించాలని భావిస్తోంది. 


మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్...టీడీపీ, చంద్రబాబును టార్గెట్‌ చేసుకున్న వారే. చంద్రబాబు, టీడీపీపైన వీరంతా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయంగా చేసే విమర్శలు స్థాయి దాటి...మాట్లాడారని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీంతో వీరి టార్గెట్‌గా కూడా పార్టీ శ్రేణులు పని చేయాల్సిన అవసరం ఉందనే ఆలోచన చేస్తోంది. వీరి కోసం క్షేత్ర స్థాయిలో నెట్‌ వర్కింగ్‌ చేసుకుని టార్గెట్‌ రీచ్‌ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. సోషల్‌ మీడియా విభాగాల ద్వారా.. ఇతరత్ర మార్గాల ద్వారా సదురు బిగ్‌ షాట్స్‌ను టార్గెట్‌ చేసుకునే ప్రక్రియకు టీడీపీ శ్రీకారం చుట్టినట్టు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలంతా ఓ ఎత్తు...తమ హిట్‌ లిస్టులో ఉన్న వీళ్ల సెగ్మెంట్లల్లో ఎన్నిక మరో ఎత్తు అనే రేంజ్‌లో టీడీపీలో చర్చ జరుగుతోంది.


కృష్ణా జిల్లాకు మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వీరిని జిల్లాకు చెందిన టీడీపీ నేతలే కాకుండా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా టార్గెట్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని, వంశీ ఇద్దరూ చంద్రబాబును.. భువనేశ్వరిని విమర్శించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  గుడివాడలో పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము,  గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు వీలైనంత వరకు అన్ని రకాల సాయం అందించేందుకు ఇప్పటికే ప్లాన్‌ సిద్దం చేసినట్టు తెలుస్తోంది. దేవినేని అవినాష్‌ టీడీపీ కార్యాలయం ధ్వంసానికి పాల్పడ్డారు. జోగి రమేష్‌ చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు. ఈ క్రమంలో వీళ్లందర్ని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూడాలని...వ్యూహాలకు పదును పెడుతోంది. వీరిని ఓడించే బాధ్యతను సీనియర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది.