Mp Raghurama Joined in Tdp: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama) టీడీపీలో చేరారు. పాలకొల్లు (Palakollu) సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో రఘురామ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు చొరవతోనే మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని.. ఆయన రుణంతో పాటు ప్రజల రుణం కూడా తీర్చుకుంటానని రఘురామ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని.. జూన్ 4న చంద్రబాబు, పవన్ ప్రభంజనం సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏమన్నారంటే.?
ఓ సైకో పాలనలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వ్యక్తి రఘురామ అని చంద్రబాబు అన్నారు. అందరి ఆమోదంతో పాలకొల్లులో ఆయన్ను మనస్ఫూర్తిగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన్ను సాదరంగా పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. సీఎం జగన్ ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేశారు. ఇది న్యాయమా.?. ఆమోద యోగ్యమా.? ఏంటీ సైకో పాలన.?. గతంలో రఘరామను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ అంశంపై రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా ప్రయత్నిస్తే.. చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారు. ఇలాంటి సైకో పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.' అంటూ చంద్రబాబు రఘరామను టీడీపీలోకి ఆహ్వానించారు.
రఘురామ కీలక వ్యాఖ్యలు
పార్టీలో చేరే ముందు రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ఓడించే సత్తా తనకు ఉందని, ఆ స్థాయికి తాను ఎదిగానని స్పష్టం చేశారు. తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని… కూటమి నుంచి పోటీ చేయడమే తన ఆశయమని అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై తనకు చాలా మంది సలహాలు ఇస్తున్నారని.. ఎక్కడి నుంచి బరిలోకి దిగినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 'నా నియోజకవర్గం నుంచి నన్ను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. అన్యాయాన్ని ఎదిరించినందుకు తనపై ఎన్నో తప్పుడు కేసులు మోపి, వ్యక్తిగతంగా వేధించారు. అధికార పార్టీలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించాను. తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాను. వైసీపీ పాలనలో కేవలం భీమవరంలోనే కాకుండా మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.' అని రఘురామ మండిపడ్డారు.
మరోవైపు, నర్సాపురం ఎంపీ స్థానం టీడీపీకి ఇచ్చేలా.. చంద్రబాబు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ స్థానం బీజేపీకి ఇచ్చి నర్సాపురం టీడీపీకి తీసుకుని రఘురామకు ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ అంశం కూడా స్పష్టత లేదని.. బీజేపీ పెద్దలు స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ కారణంగా రఘురామకృష్ణరాజుకు.. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read: YSRCP News : వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ - ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి ఇక్బాల్ రాజీనామా !