MLC Iqbal Resigned from YCP  :   అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తన్నట్లుగా ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మాజీ పోలీసు అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. హిందూపురం ఇంచార్జ్ గా కొనసాగారు. నాలుగేళ్ల వరకూ పని చేసిన తర్వాత ఆయన స్థానంలో దీపిక ను ఇంచార్జ్ గా నియమంచారు. ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయినట్లుగా తెలుస్తోంది.           

                   


హిందూపురం నియోజకవర్గంలో మొదటి నుంచి  వైసీపీలో మూడు, నాలుగు వర్గాలు ఉంాయి. ఈ వర్గ పోరులో హత్యలు కూడా చోటు చేసుకోవడం వివాదాస్పదమయింది. కర్నూలుకు జిల్లాకు చెందిన ఇక్బాల్‌కు వ్యతిరేకంగా.. పార్టీ నేతలంతా జట్టు కట్టారు.   ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆద్వర్యంలో మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీ,కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేతలంతా కలిసి స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్బాల్ ను తప్పించిన వైసీపీ హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటు ఇచ్చారు. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. రెండు వర్గాలుగా కలసి వస్తుందన్న అంచనాతో అభ్యర్థిని ఖరారు చేశారు. అయితే ఇక్బాల్ ను అసలు పరిగణనలోకి తీసకోలేదు.                                                        
 
ఇటీవలి కాలంలో ఇక్బాల్ కు పార్టీ కార్యక్రమాలకూ పిలుపు రావడం లేదు. పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన అవమానం ఫీలయ్యారు. తనకే టిక్కెట్ అని ఏడాది కిందటి వరకూ నమ్మించారని ఇప్పుడు అసలు అవమానించడం ఏమిటని ఆయన భావిస్తున్నారు. గతంలో తాను ఇంచార్జిగా ఉన్నప్పుడు వర్గ పోరాటాన్ని కంట్రోల్ చేసేలా.. హైకమాండ్ వ్యవహరించలేదని.. ఇప్పుడు పూర్తిగా అవమానిస్తున్నారని అంటున్నారు. వైసీపీ తనను నిర్లక్ష్యం చేసినందున.. తనకు ఆ పార్టీ ఇచ్చిన పదవి కూడా వద్దనుకుని రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


ఇక్బాల్ రాజకీయాల నుంచి విరమించుకుంటారా లేకపోతే మరేదైనా పార్టీలో చేరుతారా అన్నదానిపై  ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక్బాల్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేశారు.