MP Komati Reddy: నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకిరేకల్ కు చెందిన తన అనుచరులు, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న క్రమంలో ఈ సమావేశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు వీరేశం చేరికను కోమటి రెడ్డి వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అవమానించడమే అవుతుందని ఎన్నికల వ్యూహకర్త సునీల్ చెబితే చేర్చుకోవడమేనా అంటూ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీలో చాలానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈక్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజక వర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం.


కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలోకి ఆహ్వానించి నకిరేకల్ నుంచి బరిలోకి దింపితే... ఎలా వ్యవహరించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... సోమవారం రోజు మండలాల వారిగా కూర్చొని మాట్లాడుకుందాం.. అదే రోజు నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి కార్యకర్తలు ఇబ్బంది పడొద్దని వెంకట్ రెడ్డి సూచించారు. ఎవరో వస్తున్నారు, ఏదో జరిగిపోతుందంటూ వస్తున్న కథనాలు నమ్మి ఆవేశ పడొద్దని చెప్పుకొచ్చారు.


మీరు ఎవరి పేరు సూచిస్తే వారినే అభ్యర్థిగా ప్రకటిస్తానని వివరించారు. బీఆర్ఎస్ ఇటీవల విడుదల చేసిన తొలి జాబితా (115 మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల) లో టికెట్ రాకపోవడం వల్లే కాంగ్రెస్ లోకి వస్తానంటున్నారని.. కోమటి రెడ్డి చెప్పారు. పార్టీ విడిచి వెళ్లని వారు, కబ్జాలకు, బెదిరింపులకు పాల్పడని వారు కావాలంటూ శాంతియుత నకిరేకల్ నియోజకవర్గమే తన లక్ష్యం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 


అయితే టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకీ ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్ లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటారని చెప్పుకొచ్చారు. ఎన్ని బాధలు పెట్టినా భరించానని.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా అంటూ ఆయన అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే.