TDP Confident :   మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేనంత ఉత్సాహం తెప్పిస్తోంది. సెమీ ఫైనల్స్ అని స్వయంగా వైఎస్ఆర్‌సీపీ నేతలే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకుని ...ఇక ఫైనల్స్‌కు రెడీ అవుతున్నామని అంటున్నారు. నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతటి ఫలితాలు వస్తాయని టీడీపీ కూడా అనుకోలేదు. దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే వారు ఎక్కువగా పార్టీ చూడరు. అందుకే పీడీఎఫ్ అభ్యర్థులు తరచూ గెలుస్తుంటారు. అందుకే చివరి క్షణంలో పీడీఎఫ్‌తో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల విషయంలో ఒప్పందం చేసుకున్నారు. అది కలిసి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా మారింది. ప్రజాభిప్రాయం తెలిసిపోయిందని ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటమే మిగిలిందని అనుకుంటోంది.


గత నాలుగేళ్లుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న టీడీపీ 


అధికార పార్టీగా ఉన్న తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కేవలం 23 సీట్లకు పరిమితమయింది. తమ ప్రభుత్వంపై అవినీతి మరకలేమీ పడకపోగా.. పన్నులు పెంచలేదని.. అమరావతి, పోలవరాన్ని వేగంగా నిర్మించడంతో పాటు సంక్షేమాన్ని కూడా అద్భుతంగా చేపట్టామని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ ఇలాంటి ఫలితాలు వస్తాయని వారు ఊహించలేదు. దీంతో నిరాశకు గురయ్యారు. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ అణిచివేతతో నేతలు బయటకు రావడం మానేశారు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా వారిలో పట్టు మని పదిహేను మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మిగతా వారంతా సైలెంట్ అయారు. నలుగురు వైసీపీలో చేరారు. టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.  దాడులు చేశారు. స్వయంగా టీడీపీ ఆఫీసు మీద కూడా దాడి చేశారు. వీటన్నింటితో పాటు దాడులకు గురైన తమనే కేసుల్లో ఇరికిస్తున్నారని టీడీపీ నేతలు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ వ్సతున్నరు. ఈ పరిణామాల మధ్య వచ్చే ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది. అనుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన అద్భుత విజయాలు వారికి కొండంత బలాన్నిస్తున్నాయి. 


వైసీపీ పాలనా విధానాలతో ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తితో పుంజుకున్న టీడీపీ 


వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా నగదు బదిలీ పథకాలపైనే దృష్టి పెట్టింది. అభివృద్ధి అనే మాటే లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పరుగులు పెట్టిన పోలవరం వంటిప్రాజెక్టులు ఆగిపోయాయి. అమరావతి నిర్మాణం ఆపేసి మూడు రాజధానులు అంటున్నారుకానీ.. ముందుకు సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందన్న అభిప్రాయం- ప్రజల్లో ఏర్పడుతోంది. ప్రభుత్వం వేస్తున్న వివిధ రకాల పన్నుల ద్వారా నిత్యావసర రేట్లు కూడా ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నాయని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో నాలుగేళ్లలో ఎలాంటిపెట్టుబడులు తీసుకు రాలేదని యువతకు ఉపాధిచూపించలేదని.. ఉద్యోగాల కేలండర్ పేురతో మోసం చేశారన్న ఆగ్రహం యువతలో ఉందన్న అభిప్రాయం వినిపించింది. అయితే ఈ అసంతృప్తిని ప్రతిపక్ష పార్టీ క్యాష్ చేసుకోగలదా అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఫలితాలతో తమకు పూర్తి స్థాయిలో ప్రజల నుంచి భరోసా వచ్చిందని టీడీపీ నేతలంటున్నారు. 


మరోఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీకి బూస్ట్ ! 


ఖచ్చితంగా మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు గొప్ప ఊరట మాత్రమే కాదు.. ధైర్యంగా బరిలో నిలవడానికి స్ఫూర్తిని కూడా ఇస్తాయి. ఆ ప్రభావం టీడీపీ క్యాడర్ లో కనిపిస్తోంది. గత నాలుగేళ్లలో ఎప్పుడూ చేసుకోనంత  వేడుకలు ఇప్పుడు చేసుకుంటున్నరు. అలాగే పట్టభద్రుల ఎన్నికలు అధికార పార్టీకి కూడా కీలకమే.  అసలు పట్టభద్రులు ఎందుకు ఇలా స్పందించారో ఆ పార్టీ విశ్లేషణ చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి హోరాహోరీగా మారవచ్చు.