ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలో ప్రత్యేక ఆకర్షణ చిలుకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఏకాఏకిన ఎమ్మెల్యే.. వెంటనే మంత్రి పదవి కూడా అందుకుంటున్న ఘనత ఆమెది. అంతకు మించి జగన్‌ను ఒకప్పుడు రాక్షసుడు అని విమర్శించిన రికార్డు కూడా ఉంది. అలాంటి  బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెకు తన కేబినెట్‌లో కీలక స్థానం కేటాయించారు. ఇదంతా ఆమె రాజకీయ చాతుర్యం అనే అనుకోవాలి. 


ఐటీ ఉద్యోగం నుంచి టీడీపీ రాజకీయాల్లోకి ! 


అది టీడీపీ మహానాడు ప్రాంగణం. అక్కడ మాట్లాడటానికి పెద్ద పెద్ద నేతలకే చాన్స్ తక్కువ. కానీ ప్రత్తిపాటి పుల్లారావు సిఫార్సుతో ఆమెకు మహానాడు వేదికపై మాట్లాడే అవకాశం వచ్చింది. మంచి వాగ్ధాటి కలిగిన ఆమె తనకు లభించిన ఆ కొద్ది సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. చంద్రబాబునాయుడు నాటిని ఐటీ వనంలో పుట్టిన మొక్కగా తనను తాను అభివర్ణించుకున్నారు. చంద్రబాబు కూడా గర్వంగా చూశారు. ఆ తర్వాత జగన్‌ను రాక్షసుడిగా అభివర్ణించారు. దీనికో పిట్టకథ చెప్పారు. అప్పటి మహానాడులో ఈమెవరో చాలా బాగా మాట్లాడిందే అనుకున్నారు. ఆ తర్వాత చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రత్తిపాటి పుల్లారావును పక్కన పెట్టేస్తారని.. తానే ఎమ్మెల్యే అభ్యర్థినని చెప్పుకోవడం ప్రారంభించారు. ఈమె దూకుడుని గుర్తించిన పుల్లారావు వర్గీయులు దూరం పెట్టడం ప్రారంభించారు. 


వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌ను ఆకర్షించించిన రజని ! 


టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావును కాదని మరొకరికి ేట టిక్కెట్ ఇవ్వరని తేలిపోయిన తర్వాత పార్టీ కోసం పని చేసి.. తన వయసు చిన్నదే కాబట్టి  ఆయన రిటైరయ్యాక సీటు తీసుకుందామనే ఆలోచన చేయలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించారు. ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీలో ఆమె వాక్యూమ్ కనిపించింది.  టీడీపీ హైకమాండ్‌నే ఇట్టే ఆకర్షించిన ఆమెకు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు తన సమర్థత చూపడానికి పెద్దగా సమయం పట్టలేదు. మర్రి రాజశేఖర్ లాంటి ఆప్తుడైన నేతను పక్కన పెట్టి మరీ టిక్కెట్ హామీ తీసుకుని పార్టీలో చేరిపోయారు. అప్పట్నుంచి ఆమె మాట మారిపోయింది.  పార్టీ మారిదే విధానం మారిపోవడం సహజమే. అది రాజకీయ నాయకుల లక్షణం. దాన్ని ఆమె వంట బట్టించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయారు. 


దండిగా పార్టీ పెద్దల ఆశీస్సులు !


వైఎస్ఆర్‌సీపీ చిలుకలూరిపేట అభ్యర్థిగా హామీ తీసుకుని పేటలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఆమె ఈ తరానికి ఎలా రాజకీయాలు చేయాలో అలా చేశారు. కానీ వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ సహకరించడం కష్టమే. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్ .. చిలుకలూరిపేటలో ప్రత్యేకంగా సభ నిర్వహించి విడదల రజనీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్‌ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మర్రి వర్గీయులు రజనీ కోసం పని చేశారు. దీంతో ఆమె ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. రాజకీయ గురువు పుల్లారావును ఓడించింది. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో ఆమెకు తిరుగులేని స్థానం లభించింది. తన నియోజకవర్గంలో ఎవరూ వేలు పెట్టకుండా చూసుకున్నారు.  మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి కాదు కదా..  ఎమ్మెల్సీ కూడా దక్కనీయలేదన్న ప్రచారం ఉంది. ఎంపీ కృష్ణదేవరాయులు లాంటివాళ్లు తన నియోజకవర్గంలో తిరగడానికి కూడా అంగీకరించరు. ఇదంతా చేయడానికి పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉండటమే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


సామాజికవర్గంపైనా వివాదాలే !


విడదల రజనీని బీసీ రజక సామాజికవర్గ కోటా కింద మంత్రిగా చేస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలుచెబుతున్నాయి. నిజానికి  విడదల రజనీ సామాజికవర్గం ఎంటో స్పష్టత లేదు. రజక అనిప్రచారం చేసుకున్నారు కానీ ఎప్పుడూ అంగీకరించలేదు. ఆమె భర్త మాత్రం కాపు సామాజికవర్గం వారని చెబుతారు. విడదల రజనీ సామాజికవర్గం ముదిరాజ్‌లన్న అభిప్రాయం ఉంది. బీసీ అనే కేటగిరీలో మంత్రి పదవి పొందినప్పటికీ స్పష్టంగా ఏ సామాజికవర్గమో తెలియకపోవడం ఆమె ప్రత్యేకత అనుకోవచ్చు. 


సోషల్ మీడియా ప్రచారంలో విడదల రజనీ స్టైలే వేరు !


పార్టీ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుండి ఆమె బలం సోషల్ మీడియానే. చేసేది చిన్న సాయం.. పెద్ద సాయమా అన్నది కాదు... సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామా అన్నది ఆమె  చూసుకుంటారు. ప్రత్యేకంగా సోషల్ మీడియా టీములు ఆమె కోసం పని చేస్తాయి. అందుకే ఆమెకు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటి రాజకీయాలకు అర్థాలు మారిపోయాయి.  ఆ ప్రకారం చూస్తే విడదల రజనీ అందరి కంటే ముందున్నారు. అవకాశాలు అంది పుచ్చుకోవాలంటే ఏం చేయాలో ఆమెకు స్పష్టత ఉంది. సమర్థత ఉంది. ఆ సమర్థతకు లభించిన ఫలితమే మంత్రి పదవి.