Ysrcp Mla Vasantha Comments on His Political Future: వైసీపీ‍(Ycp)ని వీడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిక్కెట్లు దక్కలేదని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు వైసీపీని వీడగా, వారి బాటలోనే మరో కీలక ఎమ్మెల్యే వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో మైలవరం(Mylavaram) సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను ఇంఛార్జీగా నియమించారు. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (Vasantha Krishna Prasad) పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. సోమవారం కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చెబుతానని ఆయన స్పష్టం చేశారు. 


తెలుగుదేశం గూటికేనా..


మైలవరం టిక్కెట్‌పై తొలి నుంచి వివాదం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నా... నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) పెత్తనం ఎక్కువ అవ్వడంపై ఆయన పలుమార్లు సీఎం జగన్( Jagan) దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండు గ్రూప్‌లు పలుమార్లు గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రావెల్, ఇసుక తవ్వకాల్లో ఆధిపత్య పోరు పెచ్చు మీరడంతో, వైసీపీ అధిష్ఠానం ఇద్దరినీ పలుమార్లు మందలించింది. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీఎం జగన్ సీరియస్‌గా తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అలకబూనారు. కొన్నిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సీటుపైనా స్పష్టత ఇవ్వకపోవడంతో కొన్ని నెలల క్రితమే వసంత తెలుగుదేశం( Tdp) నేతలకు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. మంత్రి జోగి రమేశ్‌కు పెనమలూరు టిక్కెట్ కన్ఫార్మ్ చేసినా... మైలవరం టిక్కెట్‌పై జగన్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వసంత కృష్ణప్రసాద్‌ను మరింత ఆగ్రహానికి గురి చేసింది.


ముహూర్తం ఖరారు


పార్టీని వీడాలా వద్దా అన్న మీమాంసలో ఉన్న వసంత కృష్ణప్రసాద్‌కు ఇటీవల వైసీపీ విడుదల చేసిన జాబితాలో మైలవరం ఇన్‌ఛార్జిగా తిరుపతిరావు యాదవ్‌ను ప్రకటించడంతో ఇక తనదారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సమావేశమైన ఆయన వారికి తేల్చి చెప్పినట్లు తెలిసింది. సోమవారం స్వగ్రామం ఐతవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. రాజకీయంగా తమ కుటుంబానికి ఎప్పటి నుంచో అండగా ఉన్న వారి అభిప్రాయాలు తీసుకుని ఏ పార్టీలోకి వెళితే భవిష్యత్ ఉంటుందో వారితో చర్చించనున్నారు. వారందరి అభిప్రాయలు తీసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే వసంత కృష్ణప్రసాద్‌ ఎప్పటి నుంచో తెలుగుదేశం( Tdp) నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయనకు టిక్కెట్ ఇచ్చినా పార్టీని వీడటం ఖాయమని తెలిసిన తర్వాతే జగన్ మైలవరం ఇన్‌ఛార్జిని మార్చడం జరిగిందనేది వైసీపీ నాయకుల వాదన. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మైలవరంలో పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ( Devineni Uma) ఉన్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగానూ ఇరువురి వర్గాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్‌ తెలుగుదేశంలోకి వస్తే, మైలవరం టిక్కెట్టే కేటాయిస్తారా లేక మరేదైనా సీటు ఇస్తారా అన్నది సస్పెన్సే.