Pawan Kalyan Comments on CM Jagan: సీఎం జగన్ (CM Jagan) తనను తాను అర్జునుడిలా పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (Balashauri) జనసేనలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'అర్జునుడు ఆడపడుచుల్ని రక్షించాడు కానీ, ఎప్పుడూ తూలనాడలేదు. సొంత చెల్లి గురించి నీచంగా మాట్లాడుతుంటే ప్రోత్సహించే వ్యక్తి జగన్. సొంత బాబాయిని చంపేసిన నిందితుల్ని వెనకేసుకొస్తాడు. వివేకా కుమార్తె సునీత తనకు రక్షణ లేదని చెబుతున్నా పట్టించుకోడు. అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. మేమంతా కౌరవులలాగా జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.. ఇక్కడ అర్జునులు ఉండరు, కృష్ణులు ఉండరు. నేను పవన్.... ఆయన జగన్ మాత్రమే. ఇష్టానుసారం హిందూ పురాణాల్లోని వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం  మంచిది కాదు. మీది వైసీపీ, మాది జనసేన ఎవరు మంచి చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.' అని పవన్ పేర్కొన్నారు.


వైసీపీపై విమర్శలు


'నన్ను ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా, నోటికొచ్చినట్లు తిట్టినా నేను స్పందించకపోవడానికి కారణం ఉంది. ఇప్పటికే రాజకీయాల పట్ల ఒక రకమైన ఏహ్యభావం యువతలో ఉంది. నేను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఒక తరానికి రాజకీయాల మీద విరక్తి, విసుగు పుడుతుంది. ఈ కారణంతోనే హుందా రాజకీయాలు చేయాలని, హుందాగా మాట్లాడాలనే నా కోపాన్ని, ఆవేశాన్ని నాలోనే దాచుకుంటాను. దిగజారి రాజకీయాలు చేయడంలో వైసీపీ ముందుంది. గతంలో రాజకీయాలు వెగటుగా ఉన్నా కొన్ని మంచి సంప్రదాయాలు ఉండేవి. వైసీపీ వచ్చాక రాజకీయాలు దిగజారిపోయాయి. దేశంలోనే వైసీపీ దిగజారుడు రాజకీయాలు చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని వైసీపీ నాయకులు కావాలనే తీసుకొచ్చారు.' అని పవన్ అన్నారు. 


'ప్రజా కూలీ అని పిలవండి'


పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని.. అడ్డదారులు తొక్కి  అడ్డగోలుగా సంపాదించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని పవన్ తెలిపారు. 'నన్ను పవర్ స్టార్ అని పిలిస్తే అంతగా నచ్చదు. పవర్ స్టార్ అనే కంటే ప్రజా కూలీ అని పిలిస్తే చాలా ఆనందిస్తాను. నాకు మొదటి నుంచి ఆశలు, భయాలు లేవు. ప్రజలకు బలంగా నిలబడాలన్న ఆకాంక్షే నడిపిస్తోంది. పార్టీని ఓ ఉన్నతమైన లక్ష్యంతో, సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తున్నాను.' అని చెప్పారు. జనసేనలోకి ఎంతో అనుభవం ఉన్న నాయకులు శ్రీ వల్లభనేని బాలశౌరి రావడం ఆనందంగా ఉందని అన్నారు. 


'జగన్ అబద్ధాలకు అంతు లేదు'


'రాష్ట్రం అంతా సిద్ధం... సిద్ధం అంటూ పోస్టర్లతో వైసీపీ హంగామా చేస్తోంది. దేనికి సిద్ధమో? ఎందుకు సిద్ధమో? ఎవరికి అంతుపట్టడం లేదు. జగన్ చెప్పినన్ని అబద్ధాలు బహుశా ఎవరూ చెప్పి ఉండరు. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, మద్య నిషేధం... ఇలా చెప్పుకుంటూపోతే జగన్ అబద్ధాల లిస్టుకు అంతే ఉండదు. లక్షల మందిని కూడగట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి సభలు చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ సభలు పెడుతున్నారు. మేము కూడా ఎన్నికల సంగ్రామంలో దిగబోతున్నాం. రోజు మీకు సవాల్ విసురుతాం. మీరు జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తాం. మీరు సిద్ధంగా ఉంటే అంతులేని భయాన్ని ఇస్తాం. సిద్ధంగా ఉండండి.  నేను కూడా అన్నిటికి సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చాను. ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే చావో రేవో తేల్చుకుంటాను.' అని స్పష్టం చేశారు.


'ప్రతి సీటూ గెలవాలి'


'2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం పార్టీల బలమైన ప్రజా ప్రభుత్వం రాబోతోంది. విజయం తేలికగా కాదు. బలమైన పోరాటం అవసరం. శత్రువు ఎన్ని మోసాలతో అయినా మళ్లీ అధికారంలోకి రావడానికి పన్నాగాలు పన్నుతాడు. జగన్ మోసాలను జయించి విజయం సాధించాలి. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో జనసేన బలమైన పాదముద్ర ఉంటుంది. నేను సైలెంటుగా ఉన్నాను... అంతా నిస్తేజంగా ఉందని జనసైనికులు, వీర మహిళలు అనుకోవద్దు. ప్రతి మౌనం వెనుక బలమైన వ్యూహం దాగి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి చోట కచ్చితంగా గెలుపు ఉండాలనే లక్ష్యంతోనే ప్రణాళికలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసిన దగ్గర గెలిచి తీరాల్సిందే. జగన్ దుర్మార్గం మళ్లీ వస్తే రాష్ట్రాన్ని రక్షించడం అసాధ్యం. ఐదేళ్లలోనే రాష్ట్రం పరిస్థితి ఇంత దిగజారిపోతే.. మరోసారి జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడండి. స్ధానిక సంస్ధల స్థాయి పదవులు నుంచి రాష్ట్ర స్థాయి పదవులు వరకు అందరికీ... శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఎవరినీ మరిచిపోయేది లేదు. ఎవరికీ అన్యాయం జరగదు. పడిన ప్రతీ కష్టానికీ తగిన గౌరవం ఇచ్చే బాధ్యత నాది. మరోసారి దుర్మార్గ పాలన రానీయకుండా సమష్టిగా పనిచేసి ప్రజా పాలనకు పునాదులు వేద్దాం' అని జనసేనాని పిలుపునిచ్చారు.


Also Read: MP Balashauri: జనసేనలోకి ఎంపీ బాలశౌరి - సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు